Begin typing your search above and press return to search.

టీడీపీలో జోష్‌.. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల చేరిక అప్పుడే!

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:45 PM GMT
టీడీపీలో జోష్‌.. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల చేరిక అప్పుడే!
X
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారు. జూన్‌ 13 నుంచి లోకేష్‌ పాదయాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగనుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్లు.. ఆనం రాంనారాయణ రెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (నెల్లూరు రూరల్‌)ను వైసీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి చేరికకు టీడీపీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ లో చంద్రబాబు నివాసంలో కలిశారు. సుమారు గంట పాటు వీరిమధ్య సమావేశం జరిగిందని తెలుస్తోంది.

ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గంపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే తన కుమార్తె కైవల్యా రెడ్డికి కూడా ఆనం రాంనారాయణరెడ్డి సీటు అడిగినట్టు సమాచారం.

చంద్రబాబుతో సమావేశం ముగించుకున్న ఆనం రాంనారాయణ రెడ్డి తన అనుచరులతో సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. లోకేష్‌ పాదయాత్ర నెల్లూరుకి వచ్చేసరికి ఆనం పార్టీ మారనున్నట్లు సమాచారం. నెల్లూరులో భారీ స్థాయిలో బహిరంగ సభను నిర్వహించి తమ సత్తా చాటుకోవాలనే కృతనిశ్చయంతో ఆనం ఉన్నారని టాక్‌.

ఇక నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆయన సోదరుడు వైఎస్సార్‌ సేవాదళ్‌ మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి కూడా టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. టీడీపీ సీనియర్‌ నేతలు.. బీద రవిచంద్ర, మాజీ మంత్రి అమర్‌ నాథ్‌ రెడ్డి... కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. టీడీపీలో చేరాలని ఆహ్వానించారు.

అలాగే టీడీపీ సీనియర్‌ నేతలు... ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డిలను కూడా కలవనున్నారు. టీడీపీలో చేరాలని వారిని ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో బలమైన పెద్దారెడ్లుగా నెల్లూరు జిల్లాలో పేరున్న ఈ నేతల చేరికలతో టీడీపీ బలపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లోకేష్‌ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.