అమరావతి వ్యతిరేక సదస్సులా ?

Tue Oct 04 2022 12:03:20 GMT+0530 (India Standard Time)

Amravati Teleconference YSRCP Leaders

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో జరుగుతున్న పాదయాత్రకు విరుగుడుగా సదస్సులు నిర్వహించాలని వైసీపీ వ్యూహం రెడీచేస్తున్నదా ? సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రులు ఎంఎల్ఏలు సీనియర్ నేతలతో జరిపిన టెలికాన్పరెన్సులో ఇచ్చిన ఆదేశాలు ఇలాగే ఉన్నాయి. పాదయాత్రకు వ్యతిరేకంగా అధికార పార్టీ కూడా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. లేకపోతే అమరావతి నినాదమే జనాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందన్నారు.అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ విధానమన్న విషయాన్ని ప్రజలందరికీ అర్ధమయ్యేట్లుగా మంత్రులు ఎంఎల్ఏలు చొరవ తీసుకుని సదస్సులు నిర్వహించాలన్నారు. ఇప్పటికే విశాఖపట్నం కాకినాడ రాజమండ్రిలో సదస్సులు  నిర్వహించిన విషయాన్ని సజ్జల గుర్తుచేశారు.

నిర్వహించిన మూడు సదస్సులు సరిపోవని ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాల్సుంటుందని గట్టిగా చెప్పారు.

వివిధ వర్గాలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే చంద్రబాబునాయుడు ఆలోచనల ప్రకారం పాదయాత్ర జరుగుతోందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు.

ఏకైక రాజదానిగా అమరావతిని ఉంచటం వల్ల మిగిలిన ప్రాంతాలకు జరగబోయే నష్టాలేమిటి అనే విషయాలను జనాలందరికీ సంపూర్ణంగా వివరించాలని చెప్పారు. నిర్వహించే సదస్సుల్లో మేధావులు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు యువత మహిళ తటస్థులు ప్రజాసంఘాలు అందరినీ భాగస్వాములుగా చేయాలన్నారు.

గతంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి వల్ల రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత ఏపీకి జరిగిన నష్టమేమిటనేది జనాలందరికీ వివరించి చెప్పాలని సజ్జల చెప్పారు. మళ్ళీ అలాంటి సమస్యలు ఏపీలో ఉత్పన్నం కాకూడదంటే అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజదానుల అభివృద్ధి మాత్రమే సరైన మార్గమని నొక్కిచెప్పాలన్నారు. కాబట్టి వెంటనే ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అమరావతి వ్యతిరేక సదస్సులను నిర్వహించాలని ఆదేశించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.