Begin typing your search above and press return to search.

అదేంటి రోజా.. ఆ ముగ్గురే రాజీనామా ఎందుకు చేయాలి? అందరూ చేస్తే పోలా?

By:  Tupaki Desk   |   19 March 2023 5:16 PM GMT
అదేంటి రోజా.. ఆ ముగ్గురే రాజీనామా ఎందుకు చేయాలి? అందరూ చేస్తే పోలా?
X
ఏపీ మంత్రి ఆర్కే రోజా సిత్రమైన సవాలు విసిరారు. సాధారణంగా ఎవరైనా ఎవరి మీదైనా సవాలు విసిరే సమయంలో తాను ముందుకు వచ్చి.. ఫలానా పని చేస్తాను.. మీరు ఆ పని చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తారు. సవాలు విసురుతారు. అందుకు భిన్నంగా ఆర్కే రోజా మాత్రం విచిత్రమైన రీతిలో సవాలు విసిరారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎమ్మెల్యే బాలక్రిష్ణ.. అచ్చెన్నాయుడు తమ పదవులకు రాజీనామా చేయాలని.. ఎన్నికలకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు.

తాజాగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో..టీడీపీ విజయాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రజలు 175 నియోజకవర్గాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించారని.. సింబల్ పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. టీడీపీకి అంత నమ్మకమే ఉంటే.. లోకేశ్ ను ఎందుకు పోటీలో పెట్టలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె సవాలు విసురుతూ.. చంద్రబాబు.. బాలక్రిష్ణ.. అచ్చెన్నాయుడు తమ పదవులుకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతారా? అని ప్రశ్నించారు.

మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి.. ముగ్గురు విపక్ష నేతల్ని రాజీనామా చేయాలని సవాలు విసిరే రోజా.. తాను మాత్రం తన పదవికి రాజీనామా చేస్తానని.. తాను మళ్లీ గెలిచి చూపిస్తానని మాత్రం చెప్పక పోవటం దేనికి నిదర్శనం? అన్న ప్రశ్న ఎదురవుతుంది. ముగ్గురు నేతలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే బదులు.. తాజాగా వెలువడిన ఎన్నికల తీర్పు ఏ మాత్రం సరికాదని నిరూపించే ప్రయత్నమే రోజాది అయితే.. అధినేత జగన్ ను ఒప్పించి.. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఫ్రెష్ గా మొత్తం 175 స్థానాల్లో ఎన్నికలు వచ్చేలా చేస్తే.. సత్తా ఏమిటో తెలిసిపోతుంది కదా? మరి.. అలాంటి దిశగా అడుగులు వేస్తే.. మంత్రి రోజా దమ్మును.. ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.

అంతే తప్పించి.. తాను.. తన పదవిని మాత్రం క్షేమంగా ఉంచుకొని.. తన నోటికి వచ్చిన ముగ్గురు ముఖ్యనేతలు రాజీనామా చేయాలని కోరటం ఏమిటి? అందుకు బదులుగా.. మీ నుంచి ముగ్గురు రాజీనామా చేయండి.. మా నుంచి మా మంత్రులమంతా రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుదాం. అప్పుడు ఎవరేమిటో తెలుస్తుందని సవాలు విసరొచ్చు కదా? సాధారణంగా సవాలు విసిరే సమయంలో అయినా.. కాస్తంత న్యాయాన్ని ప్రదర్శిస్తారు. కానీ.. మంత్రి రోజా మాత్రం పూర్తిస్థాయి తొండి సవాలు విసిరినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. ఈ తరహా విమర్శలకు మంత్రి రోజా ఏమని బదులిస్తారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.