Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగులు...రెంటికి చెడ్డారా...?

By:  Tupaki Desk   |   31 May 2023 9:10 AM GMT
ఏపీ ఉద్యోగులు...రెంటికి చెడ్డారా...?
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పవర్ ఓటింగ్ సెక్షన్. వారు తలచుకుంటే ఏలికలకు దెబ్బ పడిపోతుంది. తాము అనుకున్న వారినే గద్దె మీద కూర్చోబెట్టగల సత్తా వారికి ఉంది. ప్రభుత్వం అంటే ఉద్యోగులే అని భావించాలి. మూడున్నర దశాబ్దాల కొలువు వారిది. అయిదేళ్ళకు ఒక మారు పాలకులు మారుతారు. అందువల్ల సీనియర్లుగా ప్రభుత్వంలో చక్రం తిప్పేవారుగా సర్కారీ ఉద్యోగులు అతి ముఖ్య పాత్ర పోషిస్తారు.

వీరే 2014లో చంద్రబాబుని నెత్తికెత్తుకున్నారు. 2019 నాటికల్లా బాబు వద్దు అంటూ జగన్ కే జై కొట్టారు. దానికి కారణం సీపీఎస్ రద్దు. ఈ హామీని పాదయాత్ర వేళ జగన్ వారికి ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే కేవలం వారం వ్యవధిలో ఆ ఫైల్ మీద సంతకం పెట్టి 2004 నాటికి ముందున్న పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పేసారు.

దాంతో ఉద్యోగులు అంతా ఒక్కటిగా నిలిచి ఫ్యాన్ ని గిర్రున తిప్పేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి సీపీఎస్ రద్దు అంటే ఎంత కష్టమో అర్ధమైపోయింది. అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేయడంతో వైసీపీ పెద్దల ఆలోచనలు ఉద్యోగ వర్గాలకు అర్ధమైపోయాయి. దాంతో అప్పటి నుంచి వచ్చింది లడాయి.

ఈ లోగా కొత్త పీయార్సీలో కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడంతో లక్షల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు వైసీపీ సర్కార్ మీద గుర్రు మీద ఉన్నారు. తమ హామీలు అంటూ సీపీఎస్ రద్దు ముందు పెట్టి మరీ అనేక ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారికి టీడీపీ నుంచి నైతిక మద్దతు కూడా దక్కుతోంది.

అయితే టీడీపీ మాత్రం సీపీఎస్ రద్దు మీద ఈ రోజు దాకా ఏ రకమైన హామీ ఇవ్వడంలేదు. ఆ మాటకు వస్తే 2014లో కూడా టీడీపీ హామీ ఇవ్వలేదు. చంద్రబాబుకు తెలుసు ఆ హామీ ఇస్తే తలకు మించిన భారమని, అది తెలియక జగన్ ఇచ్చారు, తిప్పలు పడుతున్నారు. అందుకే ఉద్యోగుల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే ఉంటోంది.

వారు ఎటూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారి ఓట్లు కచ్చితంగా తమకే పడతాయన్న ఆలోచనల్లో టీడీపీ ఉంది. రెండు పార్టీల వ్యవస్థ ఏపీలో ఉన్న క్రమంలో వైసీపీని వద్దు అనుకున్నపుడు టీడీపీకి ఎస్ అంటారు కదా అన్నదే టీడీపీ పెద్దల లాజిక్. దాంతో టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో మలి దశలో కూడా ఉద్యోగుల ప్రస్థావన ఉండకపోవచ్చు అంటున్నారు.

ఎందుకంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని హామీలు వరాలు ఇచ్చినా కూడా సీపీఎస్ రద్దుతో అవి సరిసమానం కావు. ఆ హామీ ఇవ్వకుండా ఏమి చేసినా చేయనట్లే. అందువల్ల వారికి ఏ వరమూ ప్రకటించకుండా మిన్నకుండడమే వ్యూహాత్మకమైన నిర్ణయంగా టీడీపీ భావిస్తోందిట. అందుకే ఉద్యోగుల విషయంలో వేలూ కాలూ పెట్టకుండా గమ్మున ఉండడమే బెటర్ అనుకుంటోందిట. అలా చేయడం ద్వారా గంపగుత్తగా ఓట్లు తన ఖతాలోనే వేయించుకోవచ్చు అన్నదే ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే 2014, 2019 దాకా రెండు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసి తమ డిమాండ్లు ముందు పెట్టి ఎన్నికల ప్రణాళికల్లో పెట్టించుకున్న ఉద్యోగులు ఇపుడు రెంటికీ చెడ్డారా అన్న చర్చ వస్తోంది. వారి అలవి కానీ డిమాండ్ల వల్లనే ఏ రాజకీయ పార్టీ కనీసం టచ్ చేయలేకపోతోంది అని అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి నీతి అయోగ్ నుంచి ఆర్ధిక నిపుణుల నుంచి అంతా ఓల్డ్ పెన్షన్ స్కీం కంటిన్యూ చేస్తే ప్రభుత్వాలు ఏదో నాటికి దివాళా తీస్తాయని హెచ్చరిస్తున్న నేపధ్యం ఉంది.

అయినా ఏపీలో మాత్రం ఉద్యోగులు అది తమ ప్రధాన డిమాండ్ గా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. మరి వైసీపీ సీపీఎస్ రద్దు చేయలేదు. టీడీపీ ఆ ఊసే తలవడంలేదు. ఈ రెండు పార్టీల మధ్య ఉద్యోగులు చీలిపోతారా లేక గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేస్తార లేక తమ ఇతర డిమాండ్ల కోసమైనా రాజకీయ పార్టీల మీద వత్తిడి తెస్తారా అన్నది ముందు ముందు తేలనుంది.