నా వెంట్రుక కూడా పీకలేరంటున్న జగన్!

Mon Jun 27 2022 16:00:01 GMT+0530 (IST)

AP Cm Jagan Targets Yellow Media

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన వెంట్రుక భాషను ఉపయోగించారు. ప్రతిపక్షాలు ఎల్లో మీడియా నా వెంట్రుక కూడా పీకలేవంటూ నిప్పులు చెరిగారు. జగనన్న అమ్మ ఒడి మూడో ఏడాది నిధులను జమ చేయడానికి వైఎస్ జగన్ జూన్ 27న శ్రీకాకుళం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా 4396402 మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద 6595 కోట్ల రూపాయల నిధులను జమ చేశారు.ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతలు ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్లు ఎంతమంది కలసి వచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరని విరుచుకుపడ్డారు. గతంలో నంద్యాలలో జగనన్న వసతి దీవెన నిధులను జమ చేసినప్పుడు కూడా జగన్ ఇలాగే వెంట్రుక భాషను ఉపయోగించారు.

అప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5లపై నిప్పులు కక్కారు. వారంతా కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. మళ్లీ రెండోసారి తాజాగా శ్రీకాకుళంలోనూ ఇదే మాట ఉపయోగించారు.

శ్రీకాకుళంలో తీవ్ర వ్యాఖ్యలతో ప్రతిపక్షాన్ని ఎల్లో మీడియాను జగన్ టార్గెట్ చేశారు. చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయడం లేదని.. మారీచులతో.. కుట్రలు కుయుక్తులు పన్నే వారితో యుద్దం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఎల్లో మీడియాతో యుద్దానికి తాను సిద్దమంటున్నారు. ప్రజల మద్దతే తనకు బలమని స్పష్టం చేశారు. ప్రజలంతా తన వెనుక ఉన్నారన్న ధైర్యంతోనే ముందుడుగు వేస్తున్నానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5లకు తోడు దత్తపుత్రుడు తోడయ్యాడని.. వీరంతా ప్రజలకు మంచిచేస్తున్న ప్రభుత్వంపైన విషం చిమ్ముతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని పిలుపునిచ్చారు. మంచి జరుగుతుందా? లేదా అనేది మాత్రమే చూడాలని ప్రజలు కోరారు. మంచి జరుగుతుంటే చంద్రబాబుకు నచ్చదని అందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.