Begin typing your search above and press return to search.

ఒడ్డుకు కొట్టుకొస్తున్న తిమింగలాలు

By:  Tupaki Desk   |   13 Jan 2016 10:30 AM IST
ఒడ్డుకు కొట్టుకొస్తున్న తిమింగలాలు
X
45 అడుగుల పొడవు.. 20 టన్నులు (టన్ను అంటే వెయ్యి కిలోలు) అంటే ఎంత భారీ పరిమాణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి భారీ పరిమాణం ఉన్న తిమింగలాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా మరణించి సముద్రం నుంచి బయటకు కొట్టుకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడప్పుడు ఒకటీ అరా తిమింగలాలు సముద్రతీరానికి కొట్టుకు రావటం మామూలు విషయమే అయినా.. ఒకేసారి వందకు పైగా ఒడ్డుకు కొట్టుకు రావటం.. అది కూడా మనకు పొరుగున ఉన్న తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్న సముద్ర తీరాల్లో ఇలాంటి చోటు చేసుకోవటం గమనార్హం.

తాజాగా ఇంత భారీ సంఖ్యలో మృతి చెందిన భారీ సముద్ర చరాలు ఒడ్డుకు కొట్టుకురావటం ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. దశాబ్దాల కిందట 1973లో బంగాళాఖాతంలో 147 తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తర్వాత అంత స్థాయిలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో తమిళనాడులోని కల్పాక్కం అణు కేంద్రం వద్దనున్న సముద్ర తీరానికి 50 అడుగుల పొడవైన తిమిగలం ఒకటి కొట్టుకు వచ్చింది. ఆ తర్వాత రామేశ్వరం తీరంలో కూడా మరో భారీ తిమింగల మృతదేహం ఒడ్డుకు కొట్టుకు రావటం ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై శాస్త్రీయంగా విశ్లేషించే వారు లేకపోవటం గమనార్హం. ఇటీవల కాలంలో సముద్ర జలాల్లో చోటు చేసుకుంటున్న కాలుష్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతుంటే.. మరోవైపు ఇటీవల బంగాళాఖాతంలో చోటు చేసుకోనున్న భారీ భూకంపం కూడా తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ఇంత భారీగా సముద్ర చరాలు తీరానికి కొట్టుకు వస్తున్నా.. ఇలాంటి పరిస్థితి ఎందుకన్న దానిపై అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసే ఓపికా తీరికా ప్రభుత్వం మీద లేకపోవటానికి మించిన విషాదం మరొకటి ఉండదేమో.