Begin typing your search above and press return to search.

జూన్ 2 ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఎలా అవుతుంది బాబూ...?

By:  Tupaki Desk   |   2 Jun 2023 7:54 PM GMT
జూన్ 2 ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఎలా అవుతుంది బాబూ...?
X
రెండు తెలుగు రాష్ట్రాలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. పార్టీ ఆఫీసులో ఆయన మీడియా మీటింగ్ పెట్టి మరీ ఏపీకి తెలంగాణాకు అవతరణ శుభాకాంక్షలు అనేశారు. బహుశా ఉద్యమ కాలం నాటి రెండు కళ్ల సిద్ధాంతం ఇక్కడ కూడా బాబు అప్లై చేసి ఉంటారు అనుకోవాలి.

కానీ ఒక్క మాట ఇక్కడ గమనించాలి ఉమ్మడి ఏపీ రెండు గా 2014 జూన్ 2న విడిపోయింది. కేంద్రం ఆ రోజున దేశానికి 29వ రాష్ట్రంగా తెలంగాణా ఇచ్చింది. అంటే తెలంగాణాకు అది అవతరణ దినోత్సవం. ఏపీ పూర్వపు ఆంధ్ర రాష్ట్రంగానే అదే భౌగోళిక స్వరూపంతో ఉండిపోయింది.

మరి తెలంగాణా ప్రతీ ఏటా జూన్ 2 ని ఫార్మేషన్ డే గా జరుపుకుంటుంది కానీ ఏపీకి జూన్ 2 ఎలా వర్తిస్తుందో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబే చెప్పాలి. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోవాలని తెలంగాణా కోరుకుంది. ఏపీ ప్రజలు ఉమ్మడిగా ఉండాలనుకున్నారు. కానీ అలా జరగలేదు. మొత్తానికి విభజన జరిగింది.

చంద్రబాబు విభజన ఏపీకి తొలి అయిదేళ్ళు సీఎం గా ఉన్న టైం లో ఏపీకి అవతరణ దినోత్సవమే లేదు అన్నది కూడా గుర్తు చేసుకోవాలి. నిజానికి మద్రాస్ స్టేట్ నుంచి పదకొండు జిల్లాల ఆంధ్రా రాష్ట్రం 1953 అక్టోబర్ 1న విడిపోయి ప్రత్యేక స్టేట్ గా ఏర్పడ్డాయి. ఏపీకి అవతరణ దినోత్సవం అంటే అదే అని చెప్పాలి. అలా కాదు అనుకుంటే 1956 నవంబర్ 1న ఉమ్మడి ఏపీగా ఏర్పాటు అయిన డేట్ ని అయినా తీసుకోవాలి.

ఈ రెండు డేట్స్ ని విస్మరించి టీడీపీ అయిదేళ్ల పాలన చేసింది. పైగా తెలంగాణాలో టీడీపీ రాజకీయం కోసం ప్రతీ ఏటా జూన్ 2 నుంచి 8 వరకూ సంకల్ప దీక్షలు అంటూ బాబు చేయించేవారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాదే నవంబర్ 1 ని ఏపీ ఫార్మేషన్ డేగా డిసైడ్ చేసింది. నిజానికి ఇది కూడా తప్పే అని చరిత్రకారులు విమర్శిస్తారు. అక్టోబర్ 1 అన్నదే విభజన ఏపీకి కరెక్ట్ ఫార్మేషన్ డే అని వాదిస్తూంటారు. కానీ గుడ్డిలో మెల్ల అన్నట్లుగా గత అరవై ఏళ్ళుగా అందరికీ అలవాటు అయిన నవంబర్ 1ని పెట్టారు అని ఎంతో కొంత సంతోషిస్తున్నారు.

ఇకపోతే గత నాలుగేళ్ళుగా జూన్ 2 విషయంలో ఏమీ మాట్లాడని చంద్రబాబు ఇపుడు రెండు రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు అని చెప్పడం పట్ల సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఏపీని చీల్చి తెలంగాణా కొత్త స్టేట్ అయితే ఏపీకి శుభాకాంక్షలు ఎలా చెబుతారు అని బాబుని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో టీడీపీ రాజకీయాల కోసం ఏపీ ఉనికిని ఆత్మ గౌరవాన్ని ఇలా దెబ్బ తీస్తారా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

దీని మీద కౌంటర్ గా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఏపీని విడగొట్టినందుకు జూన్ 2న ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతారా బాబూ అని విమర్శించారు. విభజన ఏపీలో పొట్టి శ్రీరాములుని ఏనాడూ బాబు గుర్తు తెచ్చుకోలేదని అన్నారు. ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా చేసిన ఘనత బాబుదే అని ఎద్దేవా చేశారు.

ఇక 2014 జూన్ 2న ఏపీని విభజించినందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని నానా మాటలు అన్న చంద్రబాబు ఇపుడు తాపీగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిగా ఉంటూ అభివృద్ధి చెందాలని తానే కోరుకున్నానని చెబుతున్నారని, ఆయన ఎలా పడితే అలా మాట్లాడేస్తారని ప్రజలు తన మాటలు వింటారని భ్రమల్లో ఉంటారని అన్నారు. హైదరాబాద్ మాజీ సీఎంలు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్సార్ టైం లో అభివృద్ధి చెందితే అంతా తన ఘనత అని బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సరే వైసీపీ విమర్శించిందని కాదు కానీ ఏపీ ఫార్మేషన్ డే జూన్ 2 అని బాబు అనడమే దారుణం అని చరిత్రకారులు అంటున్నారు. రాజకీయాలు చేసుకోవచ్చు కానీ చరిత్రను పక్కన పెట్టాలనుకోవడం తప్పు అని సూచిస్తున్నారు.