Begin typing your search above and press return to search.

వరల్డ్ అప్డేట్: 20లక్షల బాధితులు.. 1.26 లక్షల మృతులు

By:  Tupaki Desk   |   15 April 2020 5:30 AM GMT
వరల్డ్ అప్డేట్: 20లక్షల బాధితులు.. 1.26 లక్షల మృతులు
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కంటికి కనిపించని మహమ్మారి పెద్ద ఎత్తున ప్రాణాలు బలి తీసుకుంటూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య తాజాగా 20 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 1.26 లక్షలు దాటింది.

*స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికాలో వైరస్ వ్యాప్తి కొంత తెరిపినిచ్చింది. రష్యాలో కరోనా వైరస్ వ్యాప్తి ముదరడం ఆందోళన కలిగిస్తోంది.

* అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.13లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 24995మంది కొత్తగా వైరస్ బారిన పడడం అమెరికాలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఒక్కరోజులో 2129మంది మరణించడం విషాదం నింపింది. ఒక్కరోజు మరణాల్లో ప్రపంచంలోనే ఇదే అత్యధికం కావడం విషాదం నింపింది. న్యూయార్క్, న్యూజెర్సీ, మిషిగన్, లూసియానాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం ఊరట కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 26047మంది ప్రాణాలు కోల్పోయారు.

* స్పెయిన్ లో 174060 కరోనా కేసులు నమోదుకాగా.. మరణాల సంఖ్య 18వేలు దాటింది. స్పెయిన్ లో నిన్న 567మంది చనిపోయారు.

* ఇటలీలో 162488 కరోనా కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 21వేలు దాటింది. ఇటలీలో నిన్న దాదాపు 600 మంది చనిపోయారు.

*ఫాన్స్ లో 1.43 లక్షలు, జర్మనీలో 1.32 లక్షలు, బ్రిటన్ లో 93వేలు, చైనాలో 82వేలు, ఇరాన్ లో 74వేలు, టర్కీలో 65వేల కేసులు నమోదయ్యాయి.

*రష్యాలో మంగళవారం 2500కు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 170కి చేరింది. బ్రిటన్ లో 237మంది వృద్ధులు గత రెండు వారాల్లో చనిపోయారు.

*భారత్ లో 11వేల మార్క్ ను దాటిన కేసులు..
భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10815కి చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 353మంది మరణించారు. 11వేలకు ఈరోజు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా దేశంలో కేసులు వేగంగా నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. మహారాష్ట్రలోనే అత్యధికంగా 22 మంది చనిపోయారు. మొత్తం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 2337కు చేరింది. తరువాత ఢిల్లీ 1510, తమిళనాడు 1173 కేసులతో ఉన్నాయి.

*ఏపీలో 483కు చేరిన కేసులు
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 483కి చేరింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 9మంది మరణించారు. ఇక 16 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం మంగళవారం 34కొత్త కేసులు నమోదైనట్లుగా ప్రకటించింది. 15 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

*తెలంగాణలో
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 516కు చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 18మంది చనిపోయారు. మొత్తం 110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.