కెనడాలో కాల్పుల కలకలం: భారతీయ ఐటీ ఉద్యోగి హత్య వెనుక మిస్టరీ ఏమిటి?
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని, మంచి భవిష్యత్తును వెతుక్కుందామని వెళ్లిన భారతీయులకు భద్రత కరువవుతోంది.
By: Tupaki Desk | 10 Feb 2026 12:43 PM ISTవిదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని, మంచి భవిష్యత్తును వెతుక్కుందామని వెళ్లిన భారతీయులకు భద్రత కరువవుతోంది. అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఇటీవల భారతీయుల లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కెనడాలోని టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ ఐటీ ఉద్యోగి చందన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
విషాదంలో కుటుంబం
చందన్ కుమార్ మరణవార్త భారత్‌లోని ఆయన స్వగ్రామానికి చేరగానే అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు చేతికంది వస్తాడనుకున్న తరుణంలో, విగతజీవిగా మారాడన్న వార్త విని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. "అక్కడ పరిస్థితులు బాలేవు.. కొన్నాళ్ళు ఇంటికి వచ్చేయమని చెప్పాం.. కానీ ఉద్యోగ బాధ్యతల వల్ల రాలేకపోయాడు" అంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
హత్యకు కారణం అదేనా?
చందన్ హత్యకు గల కారణాలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కొన్ని కీలక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో నివసిస్తున్న కన్నడిగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి చందన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాడు. ఈ సంఘం ఏర్పాటు విషయంలో కొంతమందితో విభేదాలు తలెత్తాయని.. అవే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా చందన్ మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై కెనడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలను వారు వెల్లడించలేదు. ఇది ద్వేషపూరిత నేరమా లేక వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ సాగుతోంది.
ప్రవాసుల భద్రతపై ఆందోళన
మృదుభాషిగా.. కష్టపడే తత్వమున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చందన్ మృతితో కెనడాలోని భారతీయ సమాజం భయాందోళన చెందుతోంది. విదేశాల్లో భారతీయుల భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, చందన్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
