టెక్సాస్‌లో కోడి పందేల స్థావరంపై దాడి
ఆంధ్రాలో కోడిపందేలు కామన్. సంక్రాంతి వచ్చిందంటే నేతలు, ప్రజలు ఈ కోడిపందేలు ఘనంగా నిర్వహించి తమ ముచ్చట తీర్చుకుంటారు.
By: Tupaki Desk | 3 April 2025 10:09 AM ISTఆంధ్రాలో కోడిపందేలు కామన్. సంక్రాంతి వచ్చిందంటే నేతలు, ప్రజలు ఈ కోడిపందేలు ఘనంగా నిర్వహించి తమ ముచ్చట తీర్చుకుంటారు. బోలెడంత బెట్టింగులు కాస్తారు. అయితే ఆంధ్రాలో కాదు.. ఇప్పుడు అమెరికాలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది.. తూర్పు టెక్సాస్‌లోని హంట్ కౌంటీలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సెలెస్టే ప్రాంతంలో జరుగుతున్న కోడి పందేల స్థావరంపై షెరీఫ్‌లు మెరుపుదాడి చేసి 21 మందిని అరెస్టు చేయగా, 65 సజీవ కోళ్లను రక్షించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్‌లో పదునైన బ్లేడ్‌ల వంటి గాఫ్‌ల వల్ల తీవ్రంగా గాయపడిన 10 కోళ్లు మరణించాయి. ప్రాణాలతో బయటపడిన 65 కోళ్లను డల్లాస్‌లోని SPCA ఆఫ్ టెక్సాస్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హంట్ కౌంటీ షెరీఫ్‌లకు అందిన సమాచారం మేరకు, ఈ కోడి పందేలలో దాదాపు వంద మంది పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
కోడి పందేలు స్థానిక చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి. దీనికి పాల్పడిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో చాలా మంది పందెం రాయుళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయినప్పటికీ పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని హంట్ కౌంటీ షెరీఫ్‌ల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్, SPCA ఆఫ్ టెక్సాస్ సంయుక్తంగా నిర్వహించాయి.
షెరీఫ్ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం.. రక్షించిన సజీవ కోళ్లలో 12 కోళ్లు తీవ్రమైన గాయాల కారణంగా బతకలేని స్థితిలో ఉన్నాయి. దీంతో వాటిని పశువైద్యుడు ఖననం చేశారు. టెక్సాస్‌తో సహా అమెరికాలోని 50 రాష్ట్రాలలోనూ కోడి పందేలు దశాబ్దాలుగా చట్టవిరుద్ధం. అయినప్పటికీ అనేక గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో రహస్యంగా ఈ పందెంలు కొనసాగుతూనే ఉన్నాయి.
కోడి పందేలు నిర్వహిస్తూ పట్టుబడిన వారికి టెక్సాస్ చట్టాల ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష , $10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ ఘటన మరోసారి అమెరికాలో అక్రమంగా జరుగుతున్న కోడి పందేల యొక్క తీవ్రతను వెలుగులోకి తెచ్చింది. జంతువులను హింసించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది
