జై భీమ్ ట్రైలర్: పోరాటానికి ఒక వెపన్.. దట్స్ ఆల్!

Sat Oct 23 2021 13:00:02 GMT+0530 (IST)

Suriya Jai Bhim Trailer

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య `ఆకాశం నీ హద్దురా` (సురరై పొట్రు) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని వరుస పరాజయాలత తర్వాత సూర్య అందుకున్న సక్సెస్ అది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి మంచి ఆదరణ లభించింది. గత ఏడాది దీపావళికి ఆ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అయింది. సూర్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమది. అయితే  కొవిడ్ కారణంగా థియేటర్ లో రిలీజ్ కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్ అవ్వలేదు. కానీ సూర్యకి మాత్రం నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మళ్లీ దీపావళి సెంటిమెంట్ నే వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న `జై భీమ్` చిత్రాన్ని కూడా ఈ దీపావళికి ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో యూనిట్ ప్రచారం పనులు ముమ్మరం చేసింది. కొవిడ్ కూడా తగ్గు ముఖం పట్టడంతో సూర్య అండ్ టీమ్ ప్రచారం పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే  రిలీజ్ అయిన టీజర్.. ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో సూర్య చంద్రు అనే  న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. సమాజంలో గిరిజనులు..పేదలకు జరుగుతోన్న అన్యాయంపై చంద్రు న్యాయ పోరాటం చేస్తున్నట్లు ట్రైలర్ లో రివీల్ చేసారు. ``నీతి వాక్యాల కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థానం మౌనం చాలా ప్రమాదరకమైంది`` అంటూ సూర్య పలికే డైలాగ్ ఆకట్టుకున్నాయి.

గిరిజన మహిళకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ఎలా పోరాటం చేసాడు? అన్న థీమ్ ని ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు.  సమాజంలో అసమానతలపై చంద్రు పోరాటం ఓ విప్లవంలాగే కనిపిస్తోంది. ఇది 1995నాటి కాలానికి సంబంధించిన కథగా తెలుస్తోంది. అప్పట్లో వ్యవస్థలు ఎలా ఉండేవి?  మహిళలు బలహీన వర్గాల ప్రజలు ఎలాంటి వివక్షకు గురయ్యే వారు? వంటి అంశాల్ని ట్రైలర్ లో హైలైట్ చేసి చూపించారు. సూర్య  పెర్పార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కథలో ఎక్కడా కమర్శియల్ అంశాలు పెద్దగా కనిపించలేదు. కంటెంట్ బేస్డ్ చిత్రంగానే హైలైట్ అవుతోంది. ఈ చిత్రానికి థా.సి. జ్ఞాన్ వేల్ దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్..రాయమవు రమేష్..రాజీషా  విజయన్ కీలక పాత్రలు పోషించారు. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్య చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 2 తెలుగు..తమిళ్ లో ప్రీమియర్ రిలీజ్ కాబోతుంది.