స్టార్ హీరోని అలా లైట్ తీస్కున్నారు

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

No Promotions for Suriya Bandobasth Movie in Telugu

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు- తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సరైన హిట్టు పడక సతమవమవుతున్నాడు. సెల్వరాఘవన్ ని నమ్ముకుని చేసిన `ఎన్ జికె` - విక్రమ్ కె. కుమార్ తీసిన `24`- హరి `సింగం-3`- తానా సేంద్ర కూట్టం చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో స్టార్ హీరోగా తన అస్థిత్వం కోల్పోకూడదని సూర్య చేసిన మరో ప్రయత్నం `బందోబస్త్`. తమిళంలో `కాప్పాన్` పేరుతో కేవీ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రం ఒకేసారి రెండు భాషల్లోనూ ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్- హీరో ఆర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తెలుగులో జీరో బజ్ కొనసాగడంపై ట్రేడ్ లో చర్చ సాగుతోంది. మోహన్ లాల్ ఈ మూవీలో ప్రధాన మంత్రి పాత్రలో నటించారు. హీరో సూర్య ప్రధాన మంత్రికి సెక్యూరిటీని అందించే ఎన్ ఎస్ జీ కంమెండోగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఈవెంట్ ని చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తలైవా రజనీకాంత్- శంకర్ వంటి హేమా హేమీలు హాజరయ్యారు. దీంతో ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ తెలుగులో వెర్షన్ బందోబస్త్ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతోంది. దానికి ప్రధాన కారణం తెలుగు ప్రమోషన్స్ అత్యంత ధైన్యంగా వుండటమే. ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ హీన స్థాయిలో వుండటం వల్లే ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకుడికి చేరువ చేయలేకపోయారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఈ చిత్ర ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రతికూల అంశమని భావిస్తోంది ట్రేడ్. అంత పెద్ద స్టార్ చిత్రాన్ని ఎందుకిలా గాలికొదిలేశారని.. తమిళ స్టార్ సినిమాకి తెలుగులో జీరో ప్రమోషన్ ఏమిటో అంటూ ప్రచారం సాగుతోంది. ఒక రకంగా సూర్యని ఇక్కడ లేవనీకుండా చేస్తున్నారా అంటూ ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. ఇంతకీ ఎక్కడ ఉంది లోపం?