పాత ఇంటర్వ్యూతో శిల్పారాజ్ ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు

Tue Jul 20 2021 17:00:01 GMT+0530 (IST)

Netizens Trolling ShilpaRaj With Old Video

అవకాశాలు ఇస్తామని నమ్మబలికి.. ఆపై బ్లాక్ మొయిల్ చేసి బూతు సినిమాల్లో యాక్ట్ చేయిస్తారంటూ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మీద తీవ్రమైన ఆరోపణలు మాత్రమే కాదు.. అతగాడ్ని ముంబయి పోలీసులు అరెస్టు చేసిన వైనం పెను సంచలనంగా మారింది. నిత్యం షోకిల్లాగా తిరుగుతూ కనిపించే రాజ్ కుంద్రా.. తన అన్ లిమిటెడ్ ఖర్చుకు అవసరమైన డబ్బుల్ని ఎలా సంపాదిస్తాడు? అన్న ప్రశ్న ఎప్పటి నుంచో పలువురిని వెంటాడుతోంది. తాజాగా అతగాడి అరెస్టు నేపథ్యంలో.. నెటిజన్లు తమ మెమరీకి పరీక్ష పెట్టి మరీ.. పాత వీడియోలు తీస్తున్నారు.అప్పట్లో కపిల్ శర్మ షోకు భార్య శిల్పాతో పాటు ఆమె సోదరి షమితా శెట్టిని వెంట పెట్టుకొని మరీ రాజ్ కుంద్రా షోకు రావటం.. ఆ సందర్భంగా రాజ్  సంపాదన గురించి కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సరిగ్గా సరిపోతాయని చెబుతున్నారు. ఈ పాత వీడియోతో శిల్పా రాజ్ కుంద్రాను ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.

 ఇంతకీ ఆ పాత వీడియోలో కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ''మీరు ఎప్పుడు చూసినా టైం పాస్ చేస్తూ.. జాలీగా గడుపుతారు. ఇంత లగ్జరీ బతకడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. అసలు ఏం పని చేయకుండా మీకు డబ్బు ఎలా వస్తుంది? మీరు ఎప్పుడు చూసినా పార్టీలకు వెళ్తూ భార్యతో షాపింగ్ అంటూ తిరుగుతారు. సినీ తారలతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతుంటారు. ఇన్ని పనులు చేస్తూ బిజీగా ఉంటారు.. మీకు డబ్బులు సంపాదించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది?'' అంటూ వేసే ప్రశ్నల పరంపరకు తాజాగా సమాధానం దొరికినట్లే అంటూ పంచ్ లు వేస్తున్నారు.

నిజానికి కపిల్ శర్మ వేసిన ప్రశ్నలకు ఆ ముగ్గురు నవ్వగా.. శిల్పాశెట్టి మాత్రం సమాధానం ఇస్తే.. తన భర్త చాలా కష్టపడతారని.. ఒక్కోసారి ఆయన గంటల కొద్దీ పని చేస్తూనే ఉంటాడని.. అసలు విశ్రాంతి అన్నదే దొరకదంటూ భర్త గురించి భారీ బిల్డప్ ఇవ్వటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడా వీడియోను చూపిస్తూ.. సినిమాల్లో చాన్సుల పేరుతో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తూ.. తాను మాత్రం ఖరీదైన జీవితాన్ని గడుపుతున్నాడు. 'పాపం.. పోర్న్ సినిమాలు తీయటానికి.. అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేయటానికి చాలానే కష్టపడుతున్నాడు' అంటూ నెటిజన్లు భారీ ఎత్తున పంచ్ లు వేస్తున్నారు. అంతేకాదు.. అప్పటి కపిల్ శర్మ షోలో ఆయన అడిగిన ప్రశ్నలకు ఇంతకాలం తర్వాత సమాధానం లభించిందంటూ నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.