‘మా’ ఎన్నికల తాజా అప్డేట్.. ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు

Thu Jul 22 2021 10:08:11 GMT+0530 (IST)

Maa election latest update

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్.. సింఫుల్ గా ‘మా’ అసోసియేషన్ కు జరపాల్సిన ఎన్నికల వ్యవహారంలో భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికల్ని జరపకుండా ఆపటం తెలిసిందే. ఇదే సమయంలో.. మా ఎన్నికల్లో తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ చేసిన ప్రకటన పెను సంచలనానికి గురి చేసింది. ప్రకాశ్ రాజ్ కు పోటీగా తాము పోటీ చేస్తామంటూ జీవిత.. మంచు విష్ణు.. ఇలా పలువురు తెర మీదకు రావటంతో ఇండస్ట్రీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.‘మా’ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని కొందరు.. కాదు కాస్త ఆలస్యంగా నిర్వహించాలని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికల నిర్వహణ డేట్ మీద కొందరు సభ్యులు సంఘం క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అభిప్రాయాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ‘మా’ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జీవిత ఒక లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణపై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు.

దీనికి స్పందించిన కృష్ణంరాజు.. తనకు అందిన లేఖను క్రమశిక్షణ సంఘంలోని మిగిలిన నలుగురు సభ్యులకు పంపారు. దీంతో.. ఈ వ్యవహారం మరింత సాగుతున్నట్లుగా చెప్పాలి. ఈ విషయాన్ని తేల్చాలని కృష్ణంరాజు పంపిన లేఖకు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. తాను క్రమశిక్షణ సంఘానికి రాజీనామా చేశాను కాబట్టి ఈ విషయం మీద స్పందించలేనని చెబుతున్నారు. అయితే.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన నిర్ణయం చెబితే.. దాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

చిరంజీవిని పక్కన పెడితే.. మిగిలిన నలుగురిలో ఒకరు మోహన్ బాబు. ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడిస్తూ.. ఎన్నికల్ని వాయిదా వేయాలని చెప్పినట్లుగా సమాచారం. దీనికి భిన్నంగా ఈ సంఘంలో సభ్యులైన సీనియర్ నటి జయసుధ.. ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఉందంటూ సుదీర్ఘ లేఖ రాసినట్లు చెబుతున్నారు. ఎన్నికల్ని వాయిదా వేయటం ఎందుకు మంచిది కాదో ఆమె తన లేఖలో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

మరో సీనియర్ నటుడు మురళీమోహన్ సైతం ఎన్నికల్ని నిర్వహించాలనే వాదనను వినిపించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా నలుగురు సభ్యులున్న క్రమశిక్షణ సంఘంలోని ఇద్దరు ఎన్నికల్ని తక్షణం నిర్వహించాలని కోరుతున్నట్లుగా చెప్పాలి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఒక నిర్ణయాన్ని వెల్లడించాల్సిన పరిస్థితి కృష్ణంరాజుకు నెలకొంది. దీంతో.. ఆయనేం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఆయన తన నిర్ణయాన్ని వెంటనే వెల్లడించే అవకాశం లేదంటున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న హాట్ హాట్ పరిస్థితుల్లో ఏ నిర్ణయాన్ని వెల్లడించినా.. చర్చ కంటే రచ్చే ఎక్కువగా జరుగుతందని.. అందుకు వాతావరణం కాస్తంత కూల్ అయ్యే వరకు కామ్ గా ఉండాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.