Begin typing your search above and press return to search.

జగన్ ఇచ్చే బలమైన సంకేతం...జన్మ ధన్యమేనా...?

By:  Tupaki Desk   |   16 Aug 2022 3:30 PM GMT
జగన్ ఇచ్చే బలమైన సంకేతం...జన్మ ధన్యమేనా...?
X
జగన్ లో మంచి రాజకీయ వ్యూహకర్త ఉన్నారు. ఆయన సొంత పార్టీ వారినే కాదు పొరుగు పార్టీల వారిని కూడా ప్రేమిస్తారు. అక్కడ స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే వారిని ఇంకా ఎక్కువగా ఆదరిస్తారు. అదే సమయంలో తన పార్టీలో చేరిన వారిని ఎంత బాగా చూసుకుంటున్నానో ఒక బలమైన సంకేతాన్ని కూడా పంపించి టీడీపీని ఇరుకున పెట్టాలని చూస్తారు. ఇపుడు అలాంటిదే విశాఖలో జరిగిందా అంటే రాజకీయం తెలిసిన వారు అవును అనే అంటారు మరి.

రాజకీయ జన్మ టీడీపీలో ఎత్తి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి జగన్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళడాన్ని వైసీపీ వారు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జగన్ ఇప్పటిదాకా సొంత పార్టీ వారి పెళ్ళిళ్లకు శుభ కార్యాలకు వెళ్లారు. కొందరు నేతల ఇళ్లలో కార్యక్రమాలు ఉంటే ఆయన వీలు కాక రాలేకపోయారు. అయితే అలా వెళ్ళని వారి ఇంటికి పనిగట్టుకుని మళ్ళీ జగన్ వెళ్లింది అయితే లేదు.

తన కుమార్తె పెళ్ళికి జగన్ని సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలిచినా ఆయన హాజరుకాలేకపోయారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలక నేత, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె వివాహానికి జగన్ హాజరు కాలేకపోయారు. ఇపుడు చూస్తే వాసుపల్లి కుమారుడి వివాహానికి కూడా ఆయన రాలేకపోయినా వీలు చూసుకుని తన విశాఖ పర్యటనలో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించడం విశేషం.

దీంతో వాసుపల్లి గణేష్ కుమార్ అయితే పొంగిపోయారు. ఒక మత్స్యకారుడైన తన ఇంటికి సీఎం రావడం అంటే తన జన్మ ధన్యమైందని భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ వాసుపల్లి మీద స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. వాసుపల్లి బలమైన నాయకుడు. దూకుడు కలిగిన నేత. ఉత్తరాంధ్రాలో బలమైన కమ్యూనిటీకి చెందిన నాయకుడు.

మరో వైపు చూస్తే ఆయన టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు ఆయన ఇంటికి రాలేదు. ఇపుడు జగన్ నేరుగా వెళ్ళడం ద్వారా ఆయన అభిమానాన్నే పొందడం కాదు టీడీపీ నుంచి ఎవరు వచ్చినా ఇలాగే తాను సమాదరిస్తాను అన్న బలమైన సంకేతాలను పంపించారు అంటున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీ కీలక నేతల మీద జగన్ కన్ను ఉంది అంటున్నారు. ఎన్నికలకు ముందు వారిలో మెజారిటీని ఈ వైపునకు లాగేయాలన్న ఆలోచన కొడా ఉంది అంటున్నారు.

దాంతో వాసుపల్లికి టీడీపీతో ఉన్న గత పరిచయాలను కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రుల మీద కూడా వైసీపీ కన్ను ఉంది అని చెబుతున్నారు. టీడీపీకి ఉత్తరాంధ్రాలో పట్టు లేకుండా చేయడమే అజెండాగా వైసీపీ పని చేస్తోంది,

అదే టైమ్ లో జగన్ సైతం తన పార్టీలోనికి వచ్చిన వాసుపల్లి లాంటి వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. మరి వాసుపల్లి ఇంటికి జగన్ వెళ్ళడం, ఆయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ని కన్ ఫర్మ్ చూసిన తరువాత అయినా టీడీపీ తమ్ముళ్ళు కొందరు టెంప్ట్ అయి ఇటు వైపు జంప్ అవుతారా. వైసీపీ ఆపరేషన్ కి వారి కోపరేషన్ ఎలా ఉంటుంది అంటే వేచి చూడాల్సిందే.