సంక్షేమ ఆపేస్తే ఎలా ‘సర్’.. సుప్రీంలో కీలక విచారణ
ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించినంత మాత్రాన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేయడం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
By: Tupaki Political Desk | 17 July 2026 11:02 PM ISTఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించినంత మాత్రాన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేయడం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పౌరసత్వానికి, ఓటరు హోదాకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని కోర్టు సూచించింది.
సర్ ప్రక్రియ అనంతరం ప్రభుత్వ పథకాలకు అనర్హలను చేస్తున్నారని ఆరోపిస్తూ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ బోస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) ప్రక్రియ పేరుతో ఎన్నికల జాబితా నుంచి వేలాది మంది పేర్లను తొలగిస్తున్నారని, దీనివల్ల సంబంధితులు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే రేషన్, అన్నపూర్ణ పథకం, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను పౌరసత్వ వివాదాలతో ముడిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. పౌరసత్వ వివాదాలు పరిష్కారమయ్యే వరకు బాధితులకు అందే సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.
న్యాయస్థానం ముందు కీలక వాదనలు
కోర్టు విచారణ సందర్భంగా, పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ట్రైబ్యునళ్లలో సుమారు 34 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కేవలం 38 వేల అప్పీళ్లు మాత్రమే పరిష్కారమయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కేవలం 19 ట్రైబ్యునళ్లు మాత్రమే పనిచేస్తున్నాయని, నియామకాల్లోని జాప్యం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ట్రైబ్యునళ్ల పనితీరులో పారదర్శకత లోపించడం, పాస్‌పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నప్పటికీ, అదనపు డాక్యుమెంట్ల పేరుతో అధికారుల వేధింపులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
కోర్టు కీలక వ్యాఖ్యలు
ఎన్నికల సంఘానికి ఆర్టికల్ 324 ప్రకారం ఓటరు జాబితాను సరిచూసే అధికారం ఉన్నప్పటికీ, పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఆ సంస్థకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో బీహార్ సర్ కేసులో ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి వ్యాఖ్యానించారు. ఎన్నికల జాబితా నుంచి పేరు తొలగించడం అనేది కేవలం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, దీనిని ప్రాథమిక సామాజిక హక్కులకు ముడిపెట్టడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై జులై 25 లోపు పూర్తిస్థాయి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామం పౌరసత్వ వివాదాల్లో ఉన్న వేలాది మందికి, ముఖ్యంగా సంక్షేమ పథకాలపై ఆధారపడే వారికి ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
