'విధ్వంసం పోస్టర్ల'పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, పోలీసులకు చీవాట్లు!
ఇలాంటి పోస్టర్లు పెట్టబోయే వారికి ఎంత ధైర్యం ఉండాలి? దీనికి కారణం పోలీసుల అసమర్థతా కాదా? అంటూ హైకోర్టు ధర్మాసనం నిప్పులు చెరిగింది.
By: Tupaki Political Desk | 10 April 2026 2:00 PM ISTసోషల్ మీడియాలో అసహ్యకరమైన అభ్యంతరకర, అనుచిత పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై పోలీసులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ఏపీ హైకోర్టు మండిపడింది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కేసులను సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ విజయవాడలో ఫ్లెక్సీలు పెట్టడాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇలాంటి పోస్టర్లు పెట్టబోయే వారికి ఎంత ధైర్యం ఉండాలి? దీనికి కారణం పోలీసుల అసమర్థతా కాదా? అంటూ హైకోర్టు ధర్మాసనం నిప్పులు చెరిగింది.
2029 తర్వాత ఎవరిని విధ్వంసం చేస్తారు? ప్రజలనా? రాష్ట్రాన్నా? అంటూ ప్రశ్నించిన హైకోర్టు, పోలీసుల తీరును తప్పు పట్టింది. గతంలో హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచిన వారిపై చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. పోలీసుల తీరు ఇలా ఉంది కాబట్టే పోస్టులు పెట్టేవారు భయపడటం లేదని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని అవమానించేలా పోస్టులు పెడుతున్నారంటే ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించమేనని హైకోర్టు స్పష్టం చేసింది.
2020లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై తీవ్ర అభ్యంతరకరమైన, ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదుచేసినా, దర్యాప్తును సీబీఐకి అప్పగించినా ఫలితమే లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు, సీఐడీ, సీబీఐ ఏమీ చేయలేరనే ధైర్యంతోనే మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని కన్నెర్ర జేసింది. జడ్జిలపై పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు కేసులను డీల్ చేయడంలో పోలీసుల పనితీరు సంతృప్తికరంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను రద్దు చేయాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇంచార్జి సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎల్వోసీ కాలపరిమితి సహజంగా ఏడాది మాత్రమే ఉంటుందని, ఈ కేసులో 2024 నవంబర్ 8న ఎల్వోసీ ఇచ్చారని 2025 నవంబర్ 7తో గడువు ముగిసిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
