Begin typing your search above and press return to search.

విదేశాలకు వెళ్తే.. అర్చకత్వం కుదరదు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

ఆలయ మర్యాదలు, ఆగమ శాస్త్ర నిబంధనల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు భక్తి, ధార్మిక వర్గాల్లో అతిపెద్ద చర్చకు దారితీస్తోంది.

By:  Tupaki Desk   |   5 April 2026 12:58 PM IST
విదేశాలకు వెళ్తే.. అర్చకత్వం కుదరదు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..
X

ఆలయ మర్యాదలు, ఆగమ శాస్త్ర నిబంధనల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు భక్తి, ధార్మిక వర్గాల్లో అతిపెద్ద చర్చకు దారితీస్తోంది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులను ఆలయ గర్భాలయాల్లోకి అనుమతించవద్దనే శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలు, దేవాదాయ శాఖ పాత సర్క్యులర్‌ను అమలు చేయాలని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశించడం గమనార్హం. కేవలం విదేశీయానమే కాకుండా, ఒక అర్చకుడికి ఉండాల్సిన ఆధ్యాత్మిక క్రమశిక్షణపై ఈ తీర్పు స్పష్టతనిచ్చిందని చర్చ జరుగుతోంది. ఈ వివాదం వెనుక ఉన్న నేపథ్యం, కోర్టు పేర్కొన్న నిబంధనల గురించి తెలుసుకుందాం..

గర్భాలయ ప్రవేశానికి అడ్డంకి!

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.., గర్భాలయంలో పూజలు నిర్వహించే అర్చకులకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లిన అర్చకులు తిరిగి వచ్చాక ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లినా, తిరిగి వచ్చాక వారిని కేవలం ఆలయ ప్రాంగణం వెలుపల జరిగే వ్రతాలు, కల్యాణాలు లేదంటే ఇతర పూజలకు మాత్రమే అనుమతిస్తారు. కానీ ‘మూలవిరాట్టు’ ఉన్న గర్భాలయంలోకి అనుమతి ఉండదు.

శృంగేరి పీఠం 'ప్రామాణిక'మా!

శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 2024, డిసెంబర్‌లో విడుదల చేసిన 'ప్రామాణిక' ఈ తీర్పులో కీలకంగా మారింది. గర్భాలయంలో పూజలు చేసే అర్హత ఉండాలంటే రోజుకు మూడు సార్లు (త్రికాల) సంధ్యావందనం చేయాలి, గురు ఉపదేశ మంత్ర జపం, వేద అధ్యయనం తప్పనిసరిగా పాటించాలి. శాస్త్రోక్తమైన ఆహార నియమాలు పాటించడమే కాకుండా, సంప్రదాయానికి విరుద్ధంగా ముఖ క్షవరం చేసుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేసిన వారు గర్భాలయ అర్చకత్వానికి అనర్హులుగా ఆ ప్రామాణికంలో ఉన్నాయి. విదేశాలకు వెళ్లినప్పుడు ఆహార నియమాలు, అనుష్ఠానాలు తప్పే అవకాశం ఉన్నందున, వారిని గర్భాలయ పూజల నుంచి దూరంగా ఉంచాలని ఈ నియమావళి చెబుతోంది.

కేసు పూర్వాపరాలు..

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన సుబ్రహ్మణ్యం సోమయాజి దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 2010, నవంబర్ 10న దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను ఇప్పటి వరకు సరిగ్గా అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఈ నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్‌పై ఉంటుందని స్పష్టం చేసింది. దేవాదాయ శాఖ తరపు న్యాయవాది కూడా ఈ నిబంధనలను పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.

అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయాలు అంటే కేవలం భవనాలు కావు.. అవి శక్తి కేంద్రాలు.. అక్కడ పూజలు చేసే వారు అత్యంత పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకోవడం సహజం. ఈ తీర్పు ఆగమ శాస్త్రాల గౌరవాన్ని కాపాడుతుందని ధార్మిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిన తరుణంలో, తమ పిల్లల వద్దకో లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలకో విదేశాలకు వెళ్లే అర్చకుల పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే, వృత్తి కంటే ‘ధర్మం’, ‘నియమం’ ముఖ్యమని పీఠాధిపతులు స్పష్టం చేస్తున్నారు.

కోర్టు తీర్పు, శృంగేరి పీఠం మార్గదర్శకాలు అర్చకత్వంలో ఉండాల్సిన ఆధ్యాత్మిక లోతును గుర్తు చేస్తున్నాయి. గర్భాలయం అనేది అత్యంత పవిత్రమైనది, అక్కడ పనిచేసే వారు లోక వ్యవహారాలకు అతీతంగా, కఠిన నియమాలను పాటించాలనేది ఈ తీర్పు సారాంశం. దీనివల్ల రాబోయే రోజుల్లో పెద్ద దేవాలయాల్లో అర్చకుల నియామకాలు మరియు వారి జీవనశైలిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.