Begin typing your search above and press return to search.

బొబ్బిలియుద్ధం : వైసీపీ ఆయుధం ఎక్కడ...!?

విజయనగరం జిల్లాలో కీలకమైన స్థానం బొబ్బిలి. ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్ కి పట్టుంది. టీడీపీ పుట్టాక గెలిచింది.కేవలం మూడే మూడు సార్లు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:49 AM GMT
బొబ్బిలియుద్ధం : వైసీపీ ఆయుధం ఎక్కడ...!?
X

విజయనగరం జిల్లాలో కీలకమైన స్థానం బొబ్బిలి. ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్ కి పట్టుంది. టీడీపీ పుట్టాక గెలిచింది.కేవలం మూడే మూడు సార్లు. మిగిలిన దాంట్లో నాలుగు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ గెలిచింది. వరసగా వైసీపీ 2014 నుంచి గెలుస్తున్న సీటు ఇది. బొబ్బిలి రాజులతో ఒకసారి ఈ సీటుని గెలిచిన వైసీపీ 2019లో సీనియర్ నేత శంబంగి చిన అప్పలనాయుడుకి టికెట్ ఇచ్చి మళ్లీ గెలిచింది. ఇపుడు 2024 లో వైసీపీ ఎవరిని అభ్యర్ధిగా చేస్తుంది అన్నది ప్రశ్నగా ఉంది.

బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో ఆ పార్టీ ఇక్కడ బలంగా మారింది. ఇటీవల నారా లోకేష్ శంఖారావం సభ జిల్లా మొత్తం మీద చూస్తే బొబ్బిలిలోనే భారీగా సక్సెస్ అయింది. దాంతో టీడీపీ తమ్ముళ్లకు ఎక్కడ లేని ధీమా వచ్చింది. ఈసారి గెలిచి తీరుతామని అంటున్నారు.

మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయన ఈసారి టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో ప్రత్యర్ధులు భయపడే స్థాయిలో మెజారిటీ వస్తుందని గర్జించారు. నిజంగా చూస్తే టీడీపీ గ్రాఫ్ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి కి వ్యతిరేకత కూడా పెరిగింది.

ఈ సీటు విషయంలో మార్పు ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. ఇప్పటికి ఏడు జాబితాలను వైసీపీ రిలీజ్ చేసినా కూడా బొబ్బిలి విషయం తేల్చలేదు. దాంతో శంబంగికే టికెట్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీకి ఇబ్బందే అని సొంత పార్టీలోనే నేతలు అంటున్నారు. వర్గ పోరు కూడా ఉంది.

అయితే విజయనగరం జిల్లా వరకూ చూసుకుంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణదే భారం అన్నట్లుగా ఉంది. అధినాయకత్వం కూడా ఆయన సలహా సూచనలతో ఇక్కడ మార్పు చేర్పులు చేస్తోంది. దాంతో బొత్స తన వర్గం మనిషి అయిన శంబంగికే తిరిగి టికెట్ వచ్చేలా చూస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఆయన తప్ప గట్టి నేత కూడా వైసీపీకి కనిపించడంలేదు అని అంటున్నారు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన శంబంగి మొదటి మూడు సార్లూ టీడీపీ తరఫునే గెలిచారు. టీడీపీకి మూడు విజయాలు అందించినది కూడా ఆయనే కావడం విశేషం. అయితే శంబంగి ఇపుడు వృద్ధ నేత అయ్యారు. మునుపటిలా ఆయన దూకుడు సాగడంలేదు.

బొబ్బిలి రాజుల మీద కత్తులు దూసే పరిస్థితి ఉంటుందా అన్నది ఒక చర్చ. కానీ ఆయన వెనక ఉన్నది బొత్స అని అంటున్నారు. బొబ్బిలి రాజులకు వ్యతిరేకగా బొత్స వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. అయితే బొబ్బిలిలో మాత్రం రాజకీయం మారుతోంది. అది బొబ్బిలి రాజులకు అనుకూలం అవుతోంది. ఆ విధంగా టీడీపీకి మేలు జరగబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ మీద బొబ్బిలి యుద్ధం చేయడానికి వైసీపీ ఆయుధం గట్టిది అయి ఉండాలని అంటున్నారు.