Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీల మధ్య హోరా హోరీ పోరు !

ఏపీలో ఎవరిది అధికారం అంటే ఇంకా తెలియడం లేదు. ట్రెండ్ అన్నది అసలు ఆనవాళ్ళకు కూడా చిక్కడం లేదు

By:  Tupaki Desk   |   25 April 2024 1:30 AM GMT
వైసీపీ టీడీపీల మధ్య  హోరా హోరీ పోరు !
X

ఏపీలో ఎవరిది అధికారం అంటే ఇంకా తెలియడం లేదు. ట్రెండ్ అన్నది అసలు ఆనవాళ్ళకు కూడా చిక్కడం లేదు. అసలు జనాల మనసులో ఏముందో కూడా అంతూ పొంతూ అందడం లేదు. అంతా గుంభనంగా ఉంటున్నారు. మరి రోడ్ల మీదకు వస్తున్న వారు ఎవరూ అంటే ఆయా పార్టీలకు చెందిన వారు అనే అంటున్నారు.

అలాగే సభలకు తెస్తున్న జనాలు తోలుకుని వస్తున్న జనాలు అన్నది కూడా బహిరంగ రహస్యమే. వారు అన్ని సభలలో కనిపిస్తారు. ఎవరు అయినా తమకు ముట్టచెప్పాల్సింది చెబితే అక్కడ కనిపిస్తారు. వారికి అది ఆదాయం ఉపాధిగా ఉంది.

ఇక ఓట్లేసే జనాలు ఎక్కడ ఉన్నారు అంటే ఇంట్లోనే ఉన్నారు. నూటికి ఎనభై శాతం ఓటర్లు ఈ రోజుకీ మౌనంగానే ఉన్నారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల తంతుని జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందరి మాటలు వింటున్నారు అందరి స్పీచులూ ఆలకిస్తున్నారు. అందరి హామీలను పరిశీలిస్తున్నారు. అయినా నోరు విప్పడంలేదు. పోలింగ్ బూతుల వద్ద ఎండలో సైతం గంటల తరబడి నిలబడి ఓటేసే జనాలు అయితే పెదవి విప్పి చెప్పడంలేదు. అంటే తీర్పు ఇంకా మదిలోనే పదిలంగా ఉంది అన్న మాట.

మరి మేమే గెలుస్తున్నామని ఎవరైనా జబ్బలు చరచుకున్నా వచ్చేది మా ప్రభుత్వమే అని ధీమాగా చెప్పినా అంతా వారి ఆత్మ తృప్తి కోసమే తప్ప మరేమీ కాదు అనే అంటున్నారు. క్యాడర్ లో జోష్ పెంచేందుకే ఈ తరహా మాటలు అని అంటున్నారు.

నిజానికి చూస్తే ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఏ రకమైన ట్రెండూ కనిపించడం లేదు. పోలింగ్ కి కచ్చితంగా మరో 17 రోజులు మాత్రమే ఉన్న వేళ ఓటరు ఏమీ చెప్పడం లేదు. దాంతో బయటకు ఎంతలా డాబు కబుర్లు చెప్పినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలలో గుండెలలో రైళ్లే పరిగెడుతున్నాయి.

ఏమవుతుంది జాతకం అని మధన పడడంతో సరిపోతోంది అని అంటున్నారు. ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా చెప్పుకోవాలి. ఎలా అంటే విభజన ఏపీలో ఒకసారి టీడీపీకి జనాలు అవకాశం ఇచ్చారు. అపుడు చంద్రబాబు అనుభవం చూసారు, ఓట్లేశారు.

ఆ తరువాత 2019లో జగన్ యువకుడు అని సరికొత్తగా పాలిస్తారు అని ఆయనకూ ఒక చాన్స్ ఇచ్చారు ఇపుడు 2024లో చూస్తే ఈ ఇద్దరే ప్రధాన ప్రత్యర్ధులుగా జనం ముందుకు వస్తున్నారు. జనాలకు వేరే ఆప్షన్ లేదు అన్నది ఈ ఎన్నికలలో కనిపించే ఒక తీరని లోటు.

అందుకే కూడా జనాభిప్రాయం బయటపడడం లేదు అని అంటున్నారు ఒక విద్యార్ధిని టఫ్ క్వశ్చన్ వచ్చినపుడు చాలా సేపు ఆలోచించి జవాబు కోసం బుర్రగోక్కుంటాడు. ఏపీలో ఓటర్ల పరిస్థితి అచ్చం అలాంటిదే ఏపీలో టీడీపీకి కొన్ని ప్లస్సులు ఉన్నాయి. కొన్ని మైనస్సులు ఉన్నాయి. అలాగే వైసీపీ కి ప్లస్సులు ఉన్నాయి మైనస్సులు ఉన్నాయి.

ఏపీలో చంద్రబాబునా జగన్ నా ఎవరిని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలన్న దాని మీద ఓటరు ఎక్కువ సమయం ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి వల్ల మరో అయిదేళ్లలో ఏపీకి మేలు జరుగుతుంది. అలాగే సంక్షేమం అభివృద్ధి ఈ రెండూ కూడా ఎవరి వల్ల సాధ్యపడతాయి అని కూడా ఓటరు ఆలోచిస్తున్న నేపధ్యం ఉంది.

చంద్రబాబు అభివృద్ధి విషయంలో మార్కులు సంపాదిస్తే జగన్ సంక్షేమం విషయంలో మార్కులు సాదించారు. ఇక్కడ ఇద్దరికీ మరో వైపు మైనస్ ఉంది. ఇక ఏపీలో సంక్షేమానికి ఇద్దరూ తెర తీస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా ఉన్న నేపధ్యంలో తట్టుకోగలదా అని పట్టణ వాసులు ఆలోచిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం తమ అవసరాలకు పధకాలు అవసరం అన్న భావనలో ఉన్నారు.

మరో వైపు ఏపీలో పేరుకుపోయిన సమస్యలు అనేకం ఉన్నాయి. విభజన కష్టాలు తీరలేదు. రాజధాని పోలవరం వంటివి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దాంతో పాటు ఏపీ ప్రగతి అన్నది మరో ప్రధాన సమస్యగా ఉంది. కేంద్రం నుంచి రెండు ప్రభుత్వాలకు సహాయం పెద్దగా అందలేదు. దాంతో టీడీపీ కూటమిలో బీజేపీ ఉన్నా పెద్దగా సానుకూలత అయితే ఉండదు అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే గత ఎన్నికల్లో దాదాపుగా యాభై శాతం ఓటు షేర్ తెచ్చుకున్న వైసీపీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 40 శాతం ఓటు షేర్ ఉంటుందని అంటున్నారు. టీడీపీకి అంతే ఓటు షేర్ ఉంది. దాంతో మిగిలిన ఇరవై శాతం ఓటు షేర్ ఎవరి వైపు టర్న్ అయితే వారిదే అధికారం. దాంతో ఈసారి ఏపీలో హోరా హోరీ పోరు తప్పదని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఫలితాలు ఉంటాయని కూడా చెబుతున్నారు. ఎవరికీ ఏకపక్షంగా తీర్పు ఉండే చాన్స్ అయితే ఉండదని అంటున్నారు.