Begin typing your search above and press return to search.

ఒక పీకేతో కాక ఇంకో పీకేను తీసుకొచ్చారా? పేర్ని నాని పంచ్ లు

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న రాజకీయ వ్యూహకర్త పీకే వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి

By:  Tupaki Desk   |   4 March 2024 5:53 AM GMT
ఒక పీకేతో కాక ఇంకో పీకేను తీసుకొచ్చారా? పేర్ని నాని పంచ్ లు
X

సమయం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా వెనుకా ముందు ఆడకుండా తన మాటలతో అందరి చూపు తన మీద పడేలా చేయటంలో మాజీ మంత్రి పేర్ని నాని టాలెంట్ లెక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన వేళలో.. తెర మీదకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు పేర్ని నాని. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న రాజకీయ వ్యూహకర్త పీకే వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమవుతోంది.

ఇలాంటివేళ పేర్ని నాని రంగంలోకి దిగారు. ఒక పీకే (పవన్ కల్యాణ్)తో కావట్లేదనే మరో పీకే (ప్రశాంత్ కిశోర్) ను చంద్రబాబు తెచ్చుకున్నారని ఎటకారం ఆడేశారు. ప్రశాంత్ కిశోర్ బిహార్ లో చిత్తుగా ఓడిపోతారన్న మాట బలంగా వినిపిస్తోందని.. ఏపీలో చంద్రబాబు - పవన్ కల్యాణ్ లు చిత్తుగా ఓడిపోనున్నట్లుగా సామాన్యులు సైతం చెబుతున్నారన్నారు. చంద్రబాబు గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి ఎడాపెడా హామీలు ఇచ్చేయాలని ప్రశాంత్ కిశోర్ ఎందుకు సలహాలు ఇస్తారని ప్రశ్నించారు.

ఏపీలో పీకేకు ఎలాంటి సర్వే టీంలులేవని.. అలాంటప్పుడు జనాలు ఓట్లు వేయరని ఎలా చెబుతారు? అన్న పేర్ని నాని.. రాష్ట్రంలో డెవలప్ మెంట్ లేకుంటే వ్యవసాయం.. పరిశ్రమలు.. సేవారంగం ఐదేళ్లుగా ఎలా ముందుకు వెళ్లినట్లు అంటూ నిలదీశారు. చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్ కిశోర్ చెప్పటానికి వెనుక నెల క్రితం నేరుగా చంద్రబాబు ఇంట్లో సమావేశమేనా?అన్న పేర్నినాని.. ప్రశాంత్ కిశోర్ ను చంద్రబాబు పలుమార్లు కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

ఒక ప్రకటనతో ప్రజల నాడిని మార్చేయొచ్చని.. తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు సొంత రాష్ట్రమైన బిహార్ లో రాజకీయ భిక్షగాడిగా మారారంటూ ఎద్దేవా చేశారు. ఇంట గెలవని వాడు.. రచ్చ గెలుస్తాడా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. ప్రశాంత్ కిశోర్ ముగ్గురూ పచ్చి అబద్ధాల పోటీల్లో ప్రపంచ ఛాంపియన్లేనని మండిపడ్డారు. ఎప్పటిలానే పేర్ని నాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.