Begin typing your search above and press return to search.

రెడీ అంటున్న నెల్లూరు రెడ్లు....వైసీపీకి కొత్త సవాల్

ఇక ఈసారి వర్షాకాల సమావేశాలు మొత్తం వారం రోజుల పాటు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి సభ మొదలు కానుంది

By:  Tupaki Desk   |   18 Sep 2023 3:53 AM GMT
రెడీ అంటున్న నెల్లూరు రెడ్లు....వైసీపీకి కొత్త సవాల్
X

జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడి 52 నెలలు పూర్తి అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో విపక్షం అంటే కేవలం తెలుగుదేశం మాత్రమే. జనసేన నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఆయన కాస్తా వైసీపీలో చేరిపోయారు. ఇక టీడీపీ నుంచి నలుగురు ఎమెల్యేలు కూడా వైసీపీకి జై కొట్టారు. ఉన్న 19 మందిలో చంద్రబాబు రెండేళ్ళుగా అసెంబ్లీకి రావడంలేదు.

ఆయన తన కుటుంబాన్ని నిందించారు అని అసెంబ్లీకి నమస్కారం పెట్టారు. తాను కొత్త అసెంబ్లీకి సీఎం హోదాలోనే అటెండ్ అవుతాను అని ప్రతిన కూడా పూని సభ నుంచి సెలవ్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ సభకు హాజరవుతూ అధికార పక్షం మీద విమర్శలు చేస్తోంది. కానీ వారు ఎపుడూ సభ నుంచి సస్పెండ్ అవుతూనే ఉన్నారు.

ఇక ఈసారి వర్షాకాల సమావేశాలు మొత్తం వారం రోజుల పాటు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి సభ మొదలు కానుంది. ఈసారి సభకు అటెండ్ కావాలా వద్దా అన్నది ఇంకా టీడీపీ డెసిషన్ తీసుకోలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు.

ఆయన బయటకు వచ్చిన తరువాత టీడీపీ వ్యూహం ఖరారు అవుతుంది అంటున్నారు. ఒకవేళ బాబు అప్పటికీ రాకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే గత అసెంబ్లీకి ఈ అసెంబ్లీకి మధ్య వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కోల్పోయింది.

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు అన్న కారణం చేత వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలా సస్పెండ్ కాబడ్డ వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.

అయితే వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ ఈ నెల 21 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ అయి అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు.

ఒకటి రెండు రోజుల్లో న్యాయస్థానాల్లో నిర్ణయాలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వీరు చెప్పడం విశేషం. అంతే కాదు తమను ఎందుకు వైసీపీ సస్పెండ్ చేసింది అని వారు ప్రశ్నిస్తున్నారు. కారణాలు ఏంటో పార్టీ ఈ రోజుకీ చెప్పలేదని అంటున్నారు. అందువల్ల తాము ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న వారమని, కాబట్టి తాము సభకు వెళ్తామని అంటున్నారు.

తమకు ఉన్న హక్కులతో సభకు వెళ్ళి ప్రజా సమస్యల మీద వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని అంటున్నారు. ఇది నిజంగా వైసీపీకి వినూత్న పరిణామంగా చూడాలి. ఎందుకు అంటే ఈ ఎమ్మెల్యేలు 2019 నాటికి అధికార పక్ష సభ్యులు మధ్యలో అసంతృప్తి ఎమ్మెల్యేలు. ఇపుడు రెబెల్ ఎమ్మెల్యేలు. వీరు టీడీపీగా టెక్నికల్ గా ఎమ్మెల్యేలుగా లేరు కానీ అంతకంటే ఎక్కువగా అధికార పక్షాన్ని నిలదీస్తామని అంటున్నారు

మరి వీరు ఏమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. వీరికి ఆ చాన్స్ అధికార పక్షం ఇస్తుందా సభలో వీరిని కట్టడి చేస్తారా లేక టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగానే సస్పెండ్ అవుతూ ఉంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా నెల్లూరు రెడ్లు రెడీ అంటున్నారు. సో ఈసారి అసెంబ్లీలో వీరే స్పెషల్ అట్రాక్షన్ అన్న మాట.