కూటమికి చిక్కిపోతున్న వైసీపీ !
అంటే అమ్మకు చిక్కిన మేక మాదిరిగా వైసీపీ నేతలు కూటమి వారికి చాలా సులువుగా చిక్కిపోతున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 2:00 AM ISTవైసీపీ నాయకుల మీద వ్యూహాలు పన్ని కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఇరికిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ఆలోచనలు చేస్తూ బుర్రలు బద్ధలు కొట్టుకుంటూ కూటమి పెద్దలు రాత్రీ పగలూ బిజీ అవుతున్నారు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, ఈ సమయమంతా వైసీపీని కేసులు పెట్టి ఇరికించడమే కూటమి సర్కార్ చేస్తున్న అతి పెద్ద పని అన్నది కూడా వైసీపీ నేతలు చేస్తున్న మరో భారీ ఆరోపణ.
అయితే ఈ ఆరోపణాలలో ఎంతవరకూ వాస్తవం ఉందో అన్నది రాజకీయాల మీద ఆసక్తి అవగాహన ఉన్న ఎవరైనా కాస్తా తరచి చూస్తే కూటమి పెద్దలు అంత స్కెచ్ గీసి వైసీపీ నేతలు కానీ సానుభూతిపరులను కానీ కార్నర్ చేసేంత టైం వైసీపీ ఎక్కడ ఇస్తోంది అని అంటున్నారు. తమకు తామే చతికిల పడుతూ వారే చిక్కిపోతున్నారు అని అంటున్నారు.
అంటే అమ్మకు చిక్కిన మేక మాదిరిగా వైసీపీ నేతలు కూటమి వారికి చాలా సులువుగా చిక్కిపోతున్నారు అని అంటున్నారు. లేకపోతే ఇదేమిటి కోరి కావాలని కెలుక్కోవడం ద్వారా కడుపులో చల్ల కదలకుండా ఉండాల్సిన పెద్ద మనుషులు అరెస్టుల దాకా తెచ్చుకుంటున్నారు అంటే ఏమనుకోవాలని అంటున్నారు. ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్ అన్నది కూడా తెలియని వారు రాజకీయ విశ్లేషకుల అవతారం ఎత్తడం ఒక దురదృష్టకరమైన విషయం అయితే ఏపీకి పదకొండేళ్ళుగా రాజధాని లేదు అన్న పచ్చి నిజం తెలిసి కూడా విమర్శలు చేసే వారిని చేరదీయడం మరో పొరపాటు అంటున్నారు.
అంతే కాదు అమరావతి కాదు మూడు రాజధానులు అంటూ చేసిన రాజకీయ విన్యాసం వల్ల వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయిందన్న సత్యాన్ని తెలియకుండా చర్చా గోష్టి నడపడం మరో దురదృష్టకరం. ఇక ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా జనాలు అంగీకరించారు అన్నది గుర్తెరగకుండా ఇంకా విమర్శలు చేయాలనుకోవడం మరో దుస్సాహసం అని అంటున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక రాజధాని నగరాన్ని పట్టుకుని వైశ్యల రాజధాని అనడం కంటే ఘోరం నేరం వేరొకటి ఉంటుందా అని ఏపీకి ఏపీ రాజకీయాలకు సంబంధం లేని వారు సైతం అనుకునేలా చేసిన వ్యాఖ్యలే ఇపుడు వైసీపీకి అతి పెద్ద చిక్కులు తెప్పిస్తున్నాయి. అందుకే అక్రమాలు అరెస్టులు అని ఇపుడు గొంతు ఎంత చించుకున్నా జరిగిన విషయం అయితే వెరీ బ్యాడ్ అన్నది జనాల్లోకి వెళ్ళిపోయాక మౌనమే నా భాష అనకుండా ఇంకా సమర్ధించుకోవడం మరింత ఇబ్బంది తాముగా పెట్టుకోవడమే అని అంటున్నారు.
వైసీపీలో కోటరీ ఉందని ఆ కోటరీకి రాజకీయ పరిజ్ఞానం ఏమీ లేదని వారే వైసీపీని జగన్ ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని ఆ పార్టీ వదిలేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్యనే ట్వీట్ ఒకటి వేశారు. ఇపుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమా అన్న డౌట్ వస్తోంది అంటున్నారు. లేకపోతే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళలు ఆందోళనకు దిగితే వారిని పిశాచాలు రాక్షసులు అని పోలికతో విమర్శించడం కోటరీ పెద్దల పైత్యం కాకపోతే మరేమిటి అని కూడా విమర్శలు వస్తున్నాయి.
ఈ కేసు మాత్రమే కాదు చాలా విషయాలలో కోరి మరీ వైసీపీ చేసుకుంటోందా అనిపిస్తోంది అంటున్నారు. ఏదో అధికారంలో ఉన్నామని విమర్శించారు అతి చేశారు అనుకుంటే అది కాదు అధికారం పోయాక కూడా అదే తీరుని చాలా మంది చూపిస్తూ కూటమికి అప్పనంగా చిక్కిపోతున్నారు అని అంటున్నారు. ఒక వైసీపీ మాజీ ఎంపీ ఈ విధంగానే కారులో ఉన్న నిందితుడి మీదకు వచ్చే ప్రయత్నం చేస్తూ గుంటూరు వీధులలో చేసిన విన్యాసం వల్ల అరెస్ట్ అయినదీ చూస్తున్నారు.
ఇంత జరిగినా వైసీపీలో వ్యూహం కోరడుతోంది అని అంటున్నారు. కూటమి అయితే చాలా తెలివిగా వైసీపీ తప్పులను వాడుకుంటోంది అని చెబుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండానే కాగల కార్యాన్ని జరిపించేస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో అయితే నిర్వేదంతో కూడిన నిరాశతో కూడిన వైఖరి వల్లనే ఇదంతా వస్తోందా అంటే ఏమో తెలియదు కానీ అరెస్టులు మీద అరెస్టులు అయితే అలా జరిగిపోతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే అది ఎవరి చేతుల్లో చేతల్లో ఉందో కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంది అన్నది హితైషులే కాదు ప్రత్యర్థుల నుంచి కూడా వస్తున్న సూచనగా ఉంది అంటున్నారు.