మాజీ మేయర్ కావేటిపై వైసీపీ వేటు
వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. పార్టీ నుంచి ఒక మేయర్ స్థాయి నాయకుడిని సస్పెండ్ చేసింది.
By: Tupaki Desk | 8 Jun 2025 11:51 PM ISTవైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. పార్టీ నుంచి ఒక మేయర్ స్థాయి నాయకుడిని సస్పెండ్ చేసింది. అది కూడా రాజకీయంగా కీలకమైన చైతన్యవంతమైన జిల్లాలో కావడం విశేషం. విషయానికి వస్తే గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కావేటి విషయానికి వస్తే చాలా కాలం క్రితమే ఆయన మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఈ మేయర్ సీటు కూటమి పరం అయింది. ఆయన కూడా కూటమికి సహకరించేందుకే ఈ విధంగా చేశారు అని వైసీపీ అధినాయకత్వం అపుడే అనుమానించింది.
ఇక కావేటి అయితే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన టీడీపీలో చేరుతారు అన్న చర్చ కూడా సాగింది. ఇక చూసుకుంటే కావేటి 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
చిలకలూరిపేట నుంచి 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన విడదల రజనీని గుంటూరు పశ్చిమకు పంపించి పోటీ చేయించారు. ఆ సమయంలో కావేటిని తీసుకుని వచ్చారు. అయితే ఓటమి తరువాత విడుదల రజనీని తిరిగి చిలకలూరిపేటకు ఇంచార్జిగా చేశారు.
దాంతో కావేటి నాటి నుంచే అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగింది. మరో వైపు చూస్తే ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కూడా తనను ఇంచార్జిగా చేస్తారు అని భావించారు. ఆయనకు ఆ చాన్స్ ఇవ్వకపోవడంతో కొద్ది నెలల క్రితమే పార్టీకి గుడ్ బై కొట్టారు. అపుడే కావేటి ప్రస్తావన వచ్చింది.
అయితే కావేటి పార్టీలోనే ఉంటున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన చర్యలు ఉంటున్నాయని వైసీపీ సడెన్ గా వేటు వేసింది. మరి కావేటి పార్టీని విడిచి వెళ్తున్నారు అని తెలిసి వేటు వేశారా లేక ఆయనని వద్దు అనుకుని వేటు వేశారా అన్నది తెలియదు కానీ మొత్తానికి మాజీ మేయర్ తో పాటు మరో ఇద్దరు ఆయన సన్నిహిత కార్పోరేటర్ల మీద వైసీపీ వేటు వేసింది.
అయితే అంగబలం అర్ధబలం ఉన్న కావేటి వైసీపీకి దూరం కావడం ఇబ్బందికరమే అని అంటున్నారు. ఇక మర్రి రాజశేఖర్ వంటి వారు ఇప్పటికే దూరం అయ్యారు. ఇపుడు చిలకలూరిపేటలో మొత్తం అంతా నాయకత్వం విడదల రజనీ మీదనే పడింది. ఆమె బలమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కొని వైసీపీ జెండా ఎగరవేయాల్సి ఉంది. వైసీపీని వీడేవారు కొందరు పార్టీ వదులుకునేది మరి కొందరిని. దాంతో వైసీపీ రాజకీయం ఈ కీలకమైన ప్రాంతంలో ఎలా ఉంటుందో చూడాలి మరి అని అంటున్నారు అంతా.
