సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎం ఎటువెళ్లారు? వైసీపీ సూటి ప్రశ్నలు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పర్యటనలపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
By: Tupaki Desk | 2 Jan 2026 9:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పర్యటనలపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా వేడుక చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబం వ్యక్తిగత పర్యటనను రహస్యంగా ఎందుకు ఉంచారో తెలియజేయాలని నిలదీస్తోంది. ఈ విషయమై గురువారం వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా, శుక్రవారం ఆ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో మంత్రి లోకేశ్ ను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసింది. ఇందులో లోకేశ్ ను సకల శాఖల విచ్ఛిన్న మంత్రిగా వైసీపీ విమర్శించడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. దీనిని వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ముఖ్యమంత్రి కుటుంబం ఎక్కడికి వెళుతుందో కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు అంతా రాజధానిలో లేకుండా వెళ్లిపోవడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో మంత్రి లోకేశ్ ను షాడో సీఎం అంటూ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపిస్తూ రాజకీయ దుమారానికి తెరతీశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారనే అంశాన్ని హైలెట్ చేయడంతోపాటు మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పేందుకు వైసీపీ ఈ ఎపిసోడ్ ను వాడుకుంటోందని అంటున్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం అంటూ ప్రకటనలు ఇచ్చే సీఎం చంద్రబాబు ఎటు వెళ్లారో చెప్పకపోవడం ఏంటని వైసీపీ ప్రశ్నించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోందని అంటున్నారు. చంద్రబాబు పర్యటనపై తమకు అభ్యంతరాలు లేవంటూనే వైసీపీ పలు ప్రశ్నలు సంధిస్తోంది. చంద్రబాబు అధికారికంగా వెళ్లారా? వ్యక్తిగతంగా వెళ్లారా? సీఎం ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి ఏ ప్రదేశానికి అయినా వెళ్లొచ్చు? ఈ విషయాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఎటు వెళుతున్నది? జీఏడీకి తెలియజేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. మీడియాలో చంద్రబాబు పర్యటనపై రకరకాల ప్రచారం జరుగుతోందని అన్నారు. చంద్రబాబు విమానం దారి మళ్లిందని పలు రకాల ప్రచారం జరుగుతోందని, ఆయన అనధికారికంగా సింగపూర్ వెళ్లారని సుధాకర్ బాబు ఆరోపించారు. చంద్రబాబు పదేపదే సింగపూర్ ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఆయన నాలుగు దశాబ్దాల శ్రమ సింగపూర్ లోనే ఉందని తమకు అనుమానం ఉందన్నారు. లండన్ వెళ్లాలని అనుకున్న చంద్రబాబు సింగపూర్ వెళ్లారని వైసీపీ నేత తెలిపారు.
ఇక మంత్రి లోకేశ్ ను విమర్శిస్తూ శుక్రవారం చేసిన పోస్టులో ‘సకల శాఖ విచ్చిన్న మంత్రి నారా లోకేశ్ ఏ దేశంలో ఉన్నారు?’ కింద కామెంట్ చేయండి అంటూ తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తమకు తోచినట్లు కామెంట్లు చేస్తుండగా, టీడీపీ కార్యకర్తలు సైతం ఆ పోస్టుపై ఘాటుగా స్పందిస్తున్నారు. వైసీపీ నేత జగన్ రెడ్డి బెంగళూరు ఎందుకు వెళుతున్నారంటూ కొందరు నిలదీస్తున్నారు. ఇలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విదేశీ పర్యటనను టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టడం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపిందని అంటున్నారు.
