ఈ బెదిరింపులు వైసీపీకి ప్లస్సా మైనస్సా ?
మేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామని వైసీపీ గత కొంతకాలంగా అంటోంది.
By: Tupaki Desk | 1 Jun 2025 9:38 AM ISTమేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామని వైసీపీ గత కొంతకాలంగా అంటోంది. సప్త సముద్రాల అవతల ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని వచ్చి మరీ శిక్షిస్తాం, పదవీ విరమణ చేసిన అధికారులు అయినా వారు విదేశాలకు వెళ్ళినా వెనక్కి తెస్తామని కూడా చెబుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది.
ఇంకా నాలుగేళ్ల పాలన నిండుగా ఉంది. ఇంతలోనే వైసీపీ అంతలేసి శపధాలు చేస్తూ బెదిరిస్తూ ఉంటే అది ఆ పార్టీకి రాజకీయంగా మేలు చేస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ నేతలను వరసబెట్టి జైళ్లలో పెడుతున్నారు అన్న బాధతో వైసీపీ ఇలా రియాక్ట్ కావచ్చు. లేదా క్యాడర్ లో లీడర్ లో ఆత్మ విశ్వాసం పెంచడానికి కూడా చెబుతూ ఉండవచ్చు. అంతే కాదు పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్న భరోసా ఇవ్వడానికి అయినా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వవచ్చు.
కానీ వాటి ఫలితాలూ పర్యవసానాలు గురించి ఆలోచిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. వైసీపీలో చూసుకుంటే జైలుకు వెళ్ళి వచ్చే నాయకులు అంతా తిరిగి ఇంతటి పట్టుదలతో ఉండాలని అనుకుంటారా అన్న చర్చ వస్తోంది. చాలా మంది అయితే మానసికంగా అలసిపోతున్నారు అని అంటున్నారు ఒకనాటి రాజకీయం ఇది కాదు అని అనుకుంటున్నారు.
పైగా వైసీపీ అధికారంలోకి వస్తే అలా చేస్తామని అంటోంది. ఇపుడే అధికారంలో ఉన్న టీడీపీ అసలు ఆ చాన్స్ ఇస్తుందా అన్నది కూడా ఆలోచించాలి కదా అంటున్నారు. ఇంకో వైపు చూస్తే టీడీపీ వారికి కూడా ఇది అలెర్ట్ గా ఉండేదిగా చూస్తున్నారు. వైసీపీ మళ్ళీ వస్తే ఇంతకు ఇంత అని అంటున్నారు అంటే అసలు వారిని అధికారంలోకి రానీయకుండా ఇప్పటి నుంచే చేయడానికి పార్టీ మొత్తం సంఘటితంగా ఉంటూ చేయాల్సినది అంతా చేస్తుంది.
ఇక పోలీసు అధికారుల మీద ప్రత్యేకించి వైసీపీ హెచ్చరికలు చేస్తోంది. మరి వారు సైతం ఊరుకుంటారా ఇప్పటిదాకా వారిలో టీడీపీ పట్ల ఏ రకమైన భావన ఉందో తెలియదు కానీ టార్గెట్ అయిన వారు తప్పకుండా వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకుని రాకూడదనే పనిచేస్తారు కదా అంటున్నారు.
ఇవే కాదు తటస్థంగా ఉండేవారు, ఓటేసే ప్రజలు ఇదేమి రాజకీయం అనుకుంటారు కదా. పైగా టీడీపీని దించి వైసీపీని తెస్తే మళ్ళీ ఈ తరహా అరెస్టులు ప్రతీకార రాజకీయాలు అంతకంటే ఎక్కువగా చూడాలి అనుకుంటే వైసీపీకి అది ఏ విధంగా పాజిటివిటీని పెంచుతుంది అన్న చర్చ కూడా వస్తోంది.
తాజాగా వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విష విత్తనాలను టీడీపీ నాటుతోందని వాటి ఫలితాలను కూడా చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదని కచ్చితంగా చెబుతున్నారు. ఈ రోజు నాటుతున్న ఈ విషపూరిత విత్తనాల వల్ల భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాబు అసలు గ్రహించడం లేదని సజ్జల అంటున్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇలాంటి వాటి వల్ల వైసీపీ సాధించే దాని కంటే ఇబ్బంది పడేదే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వారు వస్తే వీరిని వీరు వస్తే వారిని ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికే అధికారం అని జనం అనుకుంటే టీడీపీ సంగతేమో కానీ వైసీపీకే తీవ్ర నష్టం అంటున్నారు.
టీడీపీ ఎటూ అధికారంలో ఉంది. దాని ప్రతీకార రాజకీయం ఈ టెర్మ్ తో పూర్తి అవుతుంది కాబట్టి మళ్లీ అదే పార్టీనే ఎన్నుకుంటే ఏ సమస్య ఉండదని ప్రజలు భావిస్తే మాత్రం వైసీపీకి అధికారం చాన్స్ ఇస్తారా అన్నది కూడా చర్చిస్తున్నారు. అందుకే రాజకీయం ఏది చేసినా జనం కోణం నుంచి చేయాలి జనం సానుభూతి పొందేలా చేయాలి. అలా కాకుండా జనాలతో కనెక్షన్ కట్ చేసుకునే విధంగా రాజకీయాలు చేయడం నేల విడిచి సాము చేయడమే అవుతుంది అని అంటున్నారు.
