Begin typing your search above and press return to search.

నాగబాబును మోసం చేశారు.. ఏపీ గ్రీన్ చైర్మన్ పదవిపై వైసీపీ రియాక్షన్

మెగా బ్రదర్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబను ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కేబినెట్ హోదాలో నియమించడంపై వైసీపీ విమర్శలు గుప్పించింది.

By:  Tupaki Desk   |   17 Aug 2026 8:21 PM IST
నాగబాబును మోసం చేశారు.. ఏపీ గ్రీన్ చైర్మన్ పదవిపై వైసీపీ రియాక్షన్
X

మెగా బ్రదర్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబను ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కేబినెట్ హోదాలో నియమించడంపై వైసీపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రమంత్రిగా పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లేఖ రాసి, ఇప్పుడు కేబినెట్ హోదాతో సరిపెట్టడంపై విమర్శలు గుప్పించింది. ఎమ్మెల్సీ నాగబాబుని ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని విమర్శించింది. నాగబాబుకు ఇచ్చిన పదవిపై టీడీపీ, జనసేన వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ శ్రేణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. ఈ విషయంలో నాగబాబుపై సానుభూతి చూపుతున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నాయి.

నాగబాబును కేబినెట్ మినిస్టర్ చేస్తామని రెండేళ్లుగా మోసం చేస్తూ వచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. నాగబాబు ఏ పదవి ఇస్తారనేది వైసీపీ పార్టీకి అవసరం లేదని, కానీ ఆయనతో ఉన్న పరిచయం, ఒకే సామాజికవర్గం కావడం వల్ల తాను స్పందిస్తున్నానని త్రిమూర్తులు చెప్పారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లేఖ ఇచ్చారని, కానీ ఇంతవరకు నెరవేర్చేలేదని దెప్పిపొడిచారు. అయినా చేసేది లేఖ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖలోనే కేబినెట్ హోదాతో నామినేడెట్ పదవితో సరిపెట్టారని వ్యాఖ్యానించారు.

స్పందించని నాగబాబు

ఏపీ గ్రీన్ చైర్మన్ గా నియమించడంపై నాగబాబు ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది. నాగబాబు నియామకం ఉత్తర్వులు వెలువడి ఒక రోజు అవుతున్నా అయినా ఏ వేదికపైనా ఈ విషయమై తన అభిప్రాయం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎంవో, జనసేన, టీడీపీకి చెందిన సోషల్ మీడియా పేజీల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మెగా స్టార్ చిరంజీవి సైతం నాగబాబును అభినందిస్తున్నట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ, నాగబాబు తనకు ఇచ్చిన పదవిపై పెదవి విప్పకపోవడంతో ఆయన సంతృప్తిగా లేరా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బుజ్జగిచ్చేందుకునా?

మరోవైపు నాగబాబును ఏపీ గ్రీన్ చైర్మను పదవిలో నియమించడం కేవలం బుజ్జగింపు చర్యగా పరిశీలకులు భావిస్తున్నారు. కేబినెట్ మంత్రి అంటు రెండేళ్ల క్రితం ప్రకటించినా, ఇంతవరకు ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఆయనలో సంతృప్తి గూడుకట్టుకుంటోందని కూటమి నాయకత్వానికి సమాచారం అందిందని, అందుకే తాజాగా కొత్తగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మనుగా నాగబాబును నియమించారని అంటున్నారు. ఇదే సమయంలో నాగబాబు ఇచ్చిన పదవిపై అజమాయిషీ మొత్తం డిప్యూటీ సీఎం పరిధిలోని అటవీ, పర్యావరణ శాఖకు ఉండటంతో నాగబాబు స్వయంగా నిరూపించుకోడానికి ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ నిర్దేశించుకున్న లక్ష్యాలను తొందరగా చేరుకోడానికి సహాయపడేలా నాగబాబును వాడుకునేందుకే ఈ పదవిని సృష్టించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకు మించి నాగబాబుకు పెద్దగా ఒరిగేదీ ఏం ఉండదని అంటున్నారు.