వైసీపీ సూటి ప్రశ్న : బిల్ గేట్స్ టీ, సమోసా ఖర్చులు చెప్పాల్సిందే..
మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ టూర్ పై వైసీపీ ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తింది.
By: Tupaki Desk | 17 Feb 2026 5:03 PM ISTమైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ టూర్ పై వైసీపీ ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తింది. బిల్ గేట్స్ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు? ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించిన వైసీపీ.. ఆయన టూర్ లో టీ, సమోసా ఖర్చులను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. బిల్ గేట్స్ టూర్ ను అధికార కూటమి హైలెట్ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించగా, కూటమికి కౌంటరుగా వైసీపీ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అతిథి రాష్ట్రానికి వస్తే, టీ, సమోసా ఖర్చులకు లెక్కలు అడగడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం రాజధాని అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరగనున్న ఏఐ సమ్మిట్ కు హాజరయ్యేందుకు భారత్ వచ్చిన బిల్ గేట్స్ ఒక రోజు ముందుగా ఏపీలో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించి ఆర్టీజీఎస్ ద్వారా అందిస్తున్న డిజిటల్ గవర్నెన్స్ సేవలను పరిశీలించారు. అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ ప్రొగ్రాంను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అంశంపై చర్చిస్తారని ప్రభుత్వం ముందుగా చెప్పింది.
అయితే బిల్ గేట్స్ పర్యటనలో ఈ అంశంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో బిల్ గేట్స్ ఎందుకు వచ్చారు? ఏం తెచ్చారు? ఆయన పర్యటన వల్ల ఏపీకి ఏం ప్రయోజనమన్న ప్రశ్నలను వైసీపీ సంధిస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఈ విషయంపై స్పందిస్తూ బిల్ గేట్స్ రావడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం? బిల్ గేట్స్ ఎందుకు వచ్చాడు? ఏ ప్రాజెక్టు, ఏ టెక్నాలజీ తెచ్చాడు? అన్న విషయాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆయన కాస్త ఆవేశంగా బిల్ గేట్స్ కు ఇచ్చిన టీ, సమోసా ఖర్చుల లెక్కలు కూడా చెప్పాలని డిమాండ్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసిందని అంటున్నారు. ఒక్క టీ, సమోసాయే కాదు బిల్ గేట్స్ కు పెట్టిన స్నాక్స్, భోజనాలు, కార్పెట్ ఖర్చులను సైతం ప్రజలకు వివరించాలని ఆయన అడగడం చర్చకు దారితీస్తోంది. అంతేకాకుండా బిల్ గేట్స్ కు వాడిన కారు, హోటల్, ఫ్లైట్ టికెట్ ఖర్చు కూడా ప్రభుత్వం తెలియజేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
బిల్ గేట్స్ టూర్ పై వైసీపీ సంధించిన ప్రశ్నలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. బిల్ గేట్స్ రావడం వల్ల రాజధాని అమరావతికి ఏం ప్రయోజనమంటూ నిలదీయడం వరకు వైసీపీ ఉద్దేశాన్ని బలపరచవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయి ఉన్న అతిథి వస్తే టీ, సమోసా ఇవ్వడం నేరం అవుతుందా? ఇది రాజకీయంగా ఆ పార్టీకి మేలు చేసే ప్రశ్నేనా? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా కూడా బిల్ గేట్స్ వస్తే టీ, సమోసా ఖర్చుల కోసం వైసీపీ ప్రశ్నిస్తోందంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ డిబేట్ గా మారిందని అంటున్నారు.
