Begin typing your search above and press return to search.

ఓటమి నుంచి జగన్ నేర్చుకుంటున్నారా ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అయితే ఒకింత ఆశ్చర్యం కలిగించాయి.

By:  Satya P   |   18 Jun 2026 9:36 PM IST
ఓటమి నుంచి జగన్ నేర్చుకుంటున్నారా ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అయితే ఒకింత ఆశ్చర్యం కలిగించాయి. అదే సమయంలో వైసీపీ క్యాడర్ లో జోష్ ని నింపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని అపుడు అగ్ర తాంబూలం తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వైసీపీ 2.0 అన్నది మామూలుగా ఉండదని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు.

మంచి పరిణామమే :

ఒక విధంగా ఏ నాయకుడు అయినా ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. వైసీపీ అయితే 2019 నుంచి 2024 దాకా అనేక విషయాలలో దూకుడుగా వ్యవహరించింది. అపరిమితమైన అధికారం దఖలు పడేసరికి తమకు తిరుగులేదని అనుకుంది. ఈ క్రమంలో సొంత పార్టీ క్యాడర్ నే పూర్తిగా పక్కకు పెట్టేసింది. అన్నింటికీ వాలంటీర్ల అనుకుంది. ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్లను నియమించడం సచివాలయం నుంచి పాలనతో పార్టీ క్యాడర్ కి ఎక్కడా ప్రాధాన్యత అన్నది లేకుండా పోయింది. దాని ఫలితాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. తమను పట్టించుకోని పార్టీని తాము ఎందుకు పట్టించుకోవాలని క్యాడర్ కూడా ఫిక్స్ అయి సైలెంట్ అయింది. దాంతోనే దారుణమైన ఓటమి వైసీపీకి దక్కింది.

వాలంటీర్లు లేనట్లే :

ఇక వాలంటీర్ల వ్యవస్థ అన్నది లేనట్లే అని జగన్ మాటలను బట్టి తెలిసిపోతోంది. వాలంటీర్లు అన్న కాన్సెప్ట్ ని పరిచయం చేసిందే వైసీపీ. వారు ఉంటే చాలు వేరే రాజకీయ వ్యవస్థ అవసరమే లేదు అని కూడా అనుకుంది. కానీ రివర్స్ అయింది. ఈ విషయం పక్కాగా వైసీపీకి అర్ధం అయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వాలంటీర్లకు పది వేలు ఇస్తామని చెప్పిన కూటమి కూడా వారి విషయం పక్కన పెట్టేసింది. దాంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఒక ఎవరూ చూడకపోవచ్చు అని అంటున్నారు.

మిగిలిన విషయాల్లో :

ఇక క్యాడర్ విషయంలో జగన్ కరెక్ట్ గానే ఆలోచించారు అని అంతా అంటున్నారు. అంతవరకూ ఓకేగా ఉన్న మిగిలిన విషయాలలో కూడా వైసీపీ అధినాయకత్వం ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యమంగా ఏపీకి అభివృద్ధి కావాలి, ఆ విషయంలో వైసీపీ తానుగా అయిదేళ్ళలో చేసింది ఒక్క ఎత్తు అయితే 2029 ఎన్నికల తరువాత తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమికి ఆల్టర్నేషన్ మోడల్ గా ఉండాల్సి ఉంది. అలాగే సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఏపీలో పారిశ్రామిక రంగం సేవా రంగం ఏఐ ఇలా కీలక రంగాలలో వైసీపీ ఆలోచనలు ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తంగా వైసీపీ ఏపీకి తమకు అయిదేళ్ళ పాటు అప్పగిస్తే దానిని ఏ విధంగా తీర్చిదిద్దుతామో అన్నది ఒక బ్లూ ప్రింట్ ని జనం ముందు ఉంచాల్సి ఉంది అని అంటున్నారు. మరి ఆ విషయంలో వైసీపీ ఏమైనా కసరత్తు ఇప్పటికే చేసిందా లేక చేసి జనం ముందు సరైన సమయంలో పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.