వైసీపీకి కార్యకర్తల కష్టాలు.. పెద్ద ఇబ్బందే ..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. `రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో` పేరుతో ఇంటింటికి తిరగాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.
By: Tupaki Desk | 29 Jun 2025 3:00 PM ISTవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. `రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో` పేరుతో ఇంటింటికి తిరగాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. అయితే మరి ఈ కార్యక్రమాన్ని ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేయట్లేదు? అనేది ఒక చర్చ. అయితే మరో విషయం చాలామంది నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం. ఇది ఆశ్చర్యం కాదు. వాస్తవమే. ఎందుకంటే నాయకుడు బయటికి రావాలి.. అంటే ప్రస్తుతం ఒక రోజుకే పాతికవేల నుంచి 50 వేల రూపాయలు ఖర్చవుతుంది.
కార్యకర్తల తరలింపు. వాహనాలు ఏర్పాటు, పెట్రోలు డీజీలు ఖర్చులు, భోజనాలు ఖర్చులు ఇవన్నీ పడుతున్నాయి. ఎంతలో అయినా పాతికవేల నుంచి 50 వేలు లేంది పూర్తికాదు. 50 మంది కార్యకర్తలు తరలించడం అనేది కష్టంగా మారిపోయింది. ఇప్పుడు జగన్ ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసంలో కనీసం ఒక 20- 30 మంది కార్యకర్తలు అయినా తోడు లేకపోతే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కార్యకర్తలు లేకుండా వాళ్ళు వెళ్తే ఇదిగో వైసిపి పరిస్థితి అయిపోయింది.. నాయకుడు పరిస్థితి అయిపోయిందని.. ప్రత్యర్థిపార్టీ నేతలు ప్రచారం చేసే అవకాశం ఉంది.
అలాగని కార్యకర్తలను తీసుకుని వెళ్తే ఖర్చులు భరించాలి. ఈ రెండు విషయాలు కూడా నాయకులకు తలనొప్పిగా మారాయి. అయితే నాయకులు ఖర్చు పెట్టడానికి, లేకపోతే కార్యకర్తలను తరలించడానికి ఇబ్బంది లేదని భావించినా ఇంత కష్టపడితే తమకు ఏంటి ప్రయోజనం? వచ్చే ఎన్నికల నాటికి తమను ఉంచుతారని, అదే నియోజకవర్గంలో పోటీకి అవకాశం ఇస్తారని గ్యారెంటీ ఏంటి? అనే విషయంలో ఇప్పటికీ వైసీపీలో ఒక నమ్మకం అయితే కనిపించడం లేదు. గత ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన పరిస్థితి ఇప్పటికీ నాయకుల కళ్ళల్లో కనిపిస్తుంది.
తమ నాయకుడి పట్ల విశ్వాసం ఉందని నమ్మకం ఉందని చెప్పుకునే అత్యంత నమ్మకస్తులైన నాయకులు కూడా అంతర్గత సమావేశాల్లో... ఏమో వచ్చే ఎన్నికలనాటికీ మా పరిస్థితి ఎలా ఉంటుందో? అనే మాటే వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు చేపట్టిన ఈ కీలక కార్యక్రమం ఇంటింటికి వైసీపీ అనేది పెద్దగా నాయకులు పట్టించుకోవడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి విషయాలన్నీ తెలుసు, నాయకులు కదలరని తెలుసు. దీంతో ఆయన తాడేపల్లి ఆఫీసులో ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గం లో పర్యటించేటప్పుడు వాటికి సంబంధించిన లైవ్ రికార్డులు తమకు పంపించాలని కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ఇది నాయకులకు మింగుడు పడటం లేదు. చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ అన్నట్టుగా నాయకులు ఇరకాటంలో పడ్డారు. చేయాలని ఉన్నవారిలో భవిష్యత్తుపై కొన్ని అనుమానాలు ఉండడం, పార్టీ పరంగా ఎంత కష్టపడినా తమకు గుర్తింపు ఉంటుందో ఉండదో అనే జంకు, వంటివి వారిని ఇరకాటంలోకి నెడుతున్నాయి. సో ముందు ఈ సమస్యను జగన్ పరిష్కరిస్తే భవిష్యత్తు లో నాయకులకు ఇబ్బంది లేదన్న పూర్తిస్థాయి భరోసాన్ని కల్పించగలిగితే మాత్రమే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుంది. విజయవంతం చేసేందుకు నాయకులు కూడా ముందుకు వస్తారు. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు.
