వైసీపీ నేతల ఫ్రెస్ట్రేషన్.. ఈ పాలిటిక్స్ మంచిదేనా.. ?
వైసీపీ నాయకులు ఫ్రెస్ట్రేషన్(ఒత్తిడి)కు గురవుతున్నారు. వారికి ఇటు పార్టీపై ఆగ్రహం.. అటు నియోజకవ ర్గంలో తమకు ఎదురవుతున్న సవాళ్లపై సందేహం.. వెరసి ఫ్రెస్ట్రేషన్ రూపంలో బయటకు వచ్చేస్తోంది.
By: Garuda Media | 27 Feb 2026 8:30 AM ISTవైసీపీ నాయకులు ఫ్రెస్ట్రేషన్(ఒత్తిడి)కు గురవుతున్నారు. వారికి ఇటు పార్టీపై ఆగ్రహం.. అటు నియోజకవ ర్గంలో తమకు ఎదురవుతున్న సవాళ్లపై సందేహం.. వెరసి ఫ్రెస్ట్రేషన్ రూపంలో బయటకు వచ్చేస్తోంది. కానీ, ఇలాంటి రాజకీయాలు తగునా? అనేది ప్రశ్న. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబా బు.. సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడారు. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.ఇలా నోరు చేసుకోవడానికి కారణం.. తనలో వచ్చిన ఫ్రెస్ట్రేషనేనని స్వయంగా రాంబాబు చెప్పుకొచ్చారు.
ఇక, బొత్స సత్యనారాయణ కూడా.. ఇటీవల మండలి సమావేశాల్లోనే నోరు జారారు. తిరుమల లడ్డూపై చర్చించాలని పట్టుబడుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి కారణంకూడా ఫ్రెస్ట్రే షనేనని ఆయన ఒప్పుకొన్నారు. ''ఫ్రెస్ట్రేషన్‌లో ఏదో అంటాం. అవన్నీ రికార్డులకు ఎక్కుతాయా?'' అని గడుసుగా ప్రశ్నించారు. ఇక, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పలువురు ఇలానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ పార్టీపై ఉన్న ఫ్రెస్ట్రేషనో.. లేక నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులో మొత్తానికి వారు నోరు పారేసుకుంటున్నారు.
తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఆయన ఫ్రెస్ట్రేషన్ పీక్‌కు వెళ్లిపోయింది. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి.. ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న వారు.. చాలా మందిఉన్నారు. ఒకరిద్దరు మంత్రులు కూడా అయ్యారు. వీరిలో కృష్ణాజిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి, నెల్లూరుకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే.. వెంకట్రామిరెడ్డి పేరు పెట్టి ఎవరినీ అనలేదు కానీ.. నోరు మాత్రం పారేసుకున్నారు.
''వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తిరిగి పార్టీలోకి వస్తామనే దొంగ మొహాలను చెప్పుతో కొడతాం.'' అంటూ.. వెంకట్రామిరెడ్డి నోరు చేసుకున్నారు. వాస్తవానికి పార్టీలు మాత్రమే శాశ్వతం. పార్టీ అధినేతలు మాత్రమే శాస్వతం. నాయకులు మారుతూ ఉంటారు. ఎక్కడ అవకాశం.. అవసరం ఉంటే అక్కడకు జంప్ చేస్తారు. వీరే ఉండాలి.. ఎవరూ రాకూడదు అని గిరి గీసుకుని ఏ పార్టీ కూడా కూర్చోదు. అంతెందుకు.. జగన్ కూడా.. గత ఏడాది ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. అయితే.. ఎవరూ రాలేదు. కానీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి వచ్చేవారు లేకపోలేదు. కానీ, వెంకట్రామిరెడ్డి తన ఫ్రెస్ట్రేషన్ అంతా నాయకులపై పారేసుకున్నారు. ఇది పార్టీకి మంచిది కాదని సీనియర్లే చెబుతున్నారు.
