వైసీపీ ఓటమికి వంద కారణాలు ...జగన్ కి తెలుసా ?
టీడీపీ కూటమి ప్రభజనం అంతా అని ఎంతలా అనుకున్నా మరీ నాసిరకంగానా ఈ తీర్పు అన్నట్లుగానే ఉంది.
By: Tupaki Desk | 5 May 2025 4:01 PMవైసీపీ ఏపీలో ఘోర పరాజయం పాలై మరో నెలకు అక్షరాలా ఏడాది అవుతుంది. 2024 జూన్ 4న వెలువడిన ఫలితాలలో వైసీపీకి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లే దక్కాయి. అంతటి కాఠిన్యమైన తీర్పుని ఏపీ ప్రజలు ఇచ్చారు. వైసీపీకి బలమున్న ప్రాంతాలలో సైతం గెలుపు పిలుపు వినలేకపోయింది. టీడీపీ కూటమి ప్రభజనం అంతా అని ఎంతలా అనుకున్నా మరీ నాసిరకంగానా ఈ తీర్పు అన్నట్లుగానే ఉంది.
ఈ తీర్పుని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో ఎలా దానిని రిసీవ్ చేసుకోవాలో ఈ రోజుకీ వైసీపీ అధినాయకత్వానికి బోధపడడం లేదు అని అంటున్నారు. వైసీపీ తమ ఓటమికి ఈవీఎంలు కారణం అంటూ చెబుతూ వస్తోంది. మరో వైపు అధినేత జగన్ అయితే చంద్రబాబు ఇచ్చిన అలవికాని హామీలకు జనాలు మోసపోయారని వారు ఎంతో బాబు చేస్తాడని ఆ వైపుగా ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు.
ఇక టీడీపీ బీజేపీ జనసేన కలసికట్టుగా ఉండడం వల్లనే ఓటమి అని మరికొందరు అన్నారు. ఏది ఏమైనా ఇదమిద్దంగా వైసీపీ ఓటమికి ఫలానా కారణం అన్నది అయితే చెప్పలేకపోయారు. పదకొండు నెలలు దాటినా సరైన ఆత్మ విమర్శ అన్నది వైసీపీ నుండి లేదని అంటున్నారు.
అయితే వైసీపీ ఓటమికి ఆ పార్టీ లోపాలు లేవా అన్నది ఒక ప్రశ్న. అలాగే అయిదేళ్ళ పాటు ప్రభుత్వాన్ని నడిపిన తీరులో తప్పులు లేవా అన్నది మరో ప్రశ్న. ఇక పార్టీకి నాయకులకు కార్యకర్తలకు మధ్య ఎడబాటు అన్నది కూడా లేదా అన్నది లేదా అన్నది మరో ప్రశ్న. చెప్పుకుంటూ పోతే వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలు అని రాజకీయ విశ్లేషకులు ఎన్నో చెప్పుకుని వచ్చారు.
ఈ నేపధ్యంలో వైసీపీ సీనియర్ నేత శాశనమండలిలో విపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమి మీద తనదైన శైలిలో విశ్లేషించారు. ఓడి పదకొండు నెలలు అయిన తరువాత విశ్లేషించడమేంటి అంటే వైసీపీలో సీనియర్లకు చాలా మందికి జరిగింది ఏమిటి జరుగుతున్నదేంటి వైసీపీ ఓటమి వెనక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అన్నది బాగా తెలుసు అని అంటున్నారు.
అందుకే బొత్స వైసీపీ ఓటమికి వంద కారణాలు అని చెప్పారు అని అంటున్నారు. కర్ణుడి చావులు వంద కారణాలు అన్నట్లుగా తమ పార్టీ పరాజయానికి కూడా వంద కారణాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మరి బొత్స సీనియర్, పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారు. జగన్ కి అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు.
పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. వైసీపీ ఓటమికి వంద కారణాలు అని చెబుతున్న ఆయన వాటిని జగన్ కి చెప్పారా అన్నదే చర్చగా ఉంది. ఇక బొత్సకు తెలిసిన కారణాలు జగన్ కి కూడా కచ్చితంగా తెలిసే అవకాశం ఉందని అనుకున్నపుడు పార్టీని గత పదకొండు నెలల కాలంలో చేస్తున్న రిపేర్లు కానీ మార్పు చేర్పులు కానీ సవ్య దిశలో సాగుతున్నాయా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.
వైసీపీకి పరాజయం ఎలా వచ్చింది అన్నది కనుక బేరీజు వేసుకుని ఆ వంద కారణాలను సశాస్త్రీయంగా విశ్లేషించుకున్నట్లు అయితే మళ్ళీ ఆ పార్టీక్ వైభవం దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీనియర్ నేత బొత్స ఈ వంద కారణాలను పార్టీలో పెట్టి అందరితో చర్చించి ఈసారి అలాంటిది పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన అవసరమూ బాధ్యత కూడా ఉందని అంటున్నారు.