Begin typing your search above and press return to search.

నేను ఎపుడూ తప్పు చేయలేదు...కడప గడ్డ మీద నుంచి జగన్ ....!

అయితే అన్నిటికీ ఒక్కటే సమాధానం ఇచ్చారు జగన్. ఆయన ప్రొద్దుటూరు లో నిర్వహించిన బస్సు యాత్రలో మాట్లాడుతూ తాను ఎపుడూ తప్పు చేయలేదు.

By:  Tupaki Desk   |   27 March 2024 2:33 PM GMT
నేను ఎపుడూ తప్పు చేయలేదు...కడప గడ్డ మీద నుంచి జగన్ ....!
X

జగన్ మీద ఎన్నో నిందలు మరెన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు ఇప్పటిదాకా విపక్షాలు చేస్తూ ఉన్నాయి. వాటికి జగన్ ఆ మధ్య దాకా జరిగిన సభల్లో వివరణ ఇస్తున్నారు కానీ ఆయన పూర్తి స్థాయిలో ఎపుడూ విపక్షాన్ని కౌంటర్ చేయలేదు. ముఖ్యంగా జగన్ కుటుంబం మీద ఆయన బాబాయ్ వివేకా హత్య మీద కూడా విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

అయితే అన్నిటికీ ఒక్కటే సమాధానం ఇచ్చారు జగన్. ఆయన ప్రొద్దుటూరు లో నిర్వహించిన బస్సు యాత్రలో మాట్లాడుతూ తాను ఎపుడూ తప్పు చేయలేదు. చేయను కూడా అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాదు తాను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాను అని ఆయన ఎమోషనల్ టచ్ ఇస్తూ చెప్పారు.

తొలిసారి తన చిన్నాన్న వివేకా హత్య మీద ఆయన చాలా విషయాలు చెప్పారు. తన చిన్నాన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ హంతకులు ఎవరో ఈ జిల్లా ప్రజలకు దేవుడికి కూడా తెలుసు అని ఆయన అన్నారు. తన చిన్నాన్నను చంపిన వారు బహిరంగగానే రోడ్ల మీద తిరుగుతున్నారని వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారో కూడా అందరికీ తెలుసు అని ఆయన అన్నారు.

తన చిన్నాన్నను చంపిన వాడు ఉండాల్సింది జైలులో కానీ వాడిని నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అని చంద్రబాబు మీద విరుచుకుని పడ్డారు. ఇదంతా ఒక పధకం ప్రకారం చేస్తూ తన మీద దారుణమైన ఆరోపణలు వారే చేస్తున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన ప్రజల సాక్షిగా చెప్పడం విశేషం.

తనకు పైన ఉన్న దేవుడు ఎదురుగా ఉన్న ప్రజలే అండ అని తాను వారి ధైర్యంతోనే రాజకీయాలు చేస్తున్నాను అని జగన్ అన్నారు. తన మీద దారుణమైన ఆరోపణలు చేస్తూ ఇతరులతో కూడా చంద్రబాబు చేయిస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో కోల్పోయిన చంద్రబాబు నీచ రాజకీయాలకు తెర తీశారు అని అన్నారు. ఆఖరుకు తన చెల్లెళ్ళను కూడా తన మీదకు ఉసి గొలుపుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక జనసేన బీజేపీని తోడు తెచ్చుకున్నారని అదీ చాలదు అన్నట్లుగా తన కుటుంబం నుంచే తన వారిని తన మీదకు ఎగదోస్తున్నారు అని జగన్ ధాటీగా విమర్శలు చేశారు. నా మీద లేని పోని విమర్శలు చేస్తూ బురద జల్లే కార్యక్రమానికి చంద్రబాబు పాల్పడుతున్నారని అన్నారు. నిత్యం అబద్ధాలు చెబుతూ కుట్రలు చేయడమే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం అని జగన్ ద్వజమెత్తారు.

అంతా కలసి ఒక్కటిగా చేరి తన మీదకు యుద్ధానికి వస్తున్నారు అని జగన్ అన్నారు. విలువలు లేని రాజకీయాలు చేయడంతో చంద్రబాబుని మించిన వారు ఎవరూ లేరని ఆయన అన్నారు. చంద్రబాబుకు తోడుగా బలమైన ఎల్లో మీడియా గ్యాంగ్ ఉందని ఆయన మండిపడ్డారు. వీరంతా లేని దాన్ని ఉన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అంటున్నారు.

అందరూ కలసి అసత్యాలు చెబుతూ కుట్రలు చేస్తూ ఒక్కడిని చేసి తన మీదకు దాడికి రావడం అంటే కలియుగం కాక దీన్ని మరేమంటారు అని జగన్ ప్రశ్నించారు. ఇక అధికారం రాజకీయ లబ్ది కోసం తపించిపోతున్న తనవాళ్ళు ఒకరిద్దరు ఈ కుట్రలో భాగం అయ్యారు అంటూ జగన్ తన చెల్లెళ్ల మీద కూడా కామెంట్స్ చేశారు.