Begin typing your search above and press return to search.

ఒకరికి విశ్వసనీయత లేదు.. మరొకరికి విలువలు లేవు... జగన్ ఫైర్!

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రస్థావన తెచ్చిన జగన్... వారి పేర్లు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమూ ఉండదని.. గతంలో ఏ పథకం ఇస్తారో, ఎవరికి ఇస్తారో తెలిసేది కాదని అన్నారు.

By:  Tupaki Desk   |   14 March 2024 8:27 AM GMT
ఒకరికి విశ్వసనీయత లేదు.. మరొకరికి  విలువలు లేవు... జగన్  ఫైర్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏర్పాటు చేస్తున్న సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డోసు పెంచుతున్నారు. ప్రత్యర్థులపై చేసే విమర్శల్లో వాడీ, వేడీ పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రధానంగా తనకూ.. చంద్రబాబు, పవన్ లకు ఉన్న తేడాను వీలైనంత స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు! 2014 - 19 మధ్య చంద్రబాబు – పవన్ లు ఏపీలో అందించిన పాలనకూ 2019 తర్వాత తన పాలనకూ తేడా గమనించమని కోరుతున్నారు.

ఇదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించినట్లు చెబుతున్న జగన్... ఆ మేనిఫెస్టోలో 95శాతానికి పైగా హామీలను నేరవేర్చినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో తన పాలనలో మీ మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే ఓటు వేయమని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న జగన్... మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేశారు! ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం సహకరిస్తుందని తెలిపారు. కొత్తగా సుమారు 65వేల మంది ఈ సాయాన్ని అందుకుంటున్నారని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రస్థావన తెచ్చిన జగన్... వారి పేర్లు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమూ ఉండదని.. గతంలో ఏ పథకం ఇస్తారో, ఎవరికి ఇస్తారో తెలిసేది కాదని అన్నారు. తన పాలనలో మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా జమచేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని జగన్ పునరుద్ఘాటించారు.

ఈ క్రమంలోనే... చంద్రబాబు పేరు చెబితే అక్కాచెల్లమ్మలకు ఆయన చేసిన వంచన మాత్రమే గుర్తొస్తుందని.. పొదుపు సంఘాల మహిళలకు చేసిన దగా గుర్తొస్తుందని.. అంతే తప్ప ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని జగన్ విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే... అని మొదలుపెట్టిన జగన్... అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడని అన్నారు.

ఐదేళ్లకోసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడని దుయ్యబట్టారు! ఆ విధంగా... చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, పవన్ కల్యాణ్ కు విలువలు లేవని వైఎస్ జగన్ ఫైరయ్యారు. 2014లో కూడా వీరిద్దరూ బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లారని.. నాడు సంతకం పెట్టి ఇచ్చిన హామీలను కూడా అమలుచేయకుండా మోసం చేశారని విమర్శించారు.