ప్రతిపక్షంగా అధికార పక్షానికి జై కొడతారా? జగన్ పై షర్మిల ఫైర్!
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులకు వైసీపీ మద్దతు తెలపడంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By: Tupaki Desk | 19 April 2026 11:33 AM ISTకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులకు వైసీపీ మద్దతు తెలపడంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, బీజేపీకి మధ్య ఉన్న సంబంధం బట్టబయలైందని ధ్వజమెత్తారు. జగన్ పై ఉన్న కేసుల నుంచి రక్షణ పొందడానికే ప్రధాని మోదీకి బాసినగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఉన్న వైసీపీ అధికార పక్షానికి మద్దతు పలకడం ఎక్కడైనా ఉందా? అంటూ నిలదీసిన షర్మిల తన సోదరుడుపై అనేక ప్రశ్నలు సంధిస్తూ ఘాటు వ్యాఖ్యలతో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
తెర తొలగింది
కేంద్రానికి మద్దతు తెలిపిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి బీజేపీకి దత్త పుత్రుడుగా నిరూపించుకున్నారని షర్మిల ఆరోపించారు. ‘‘దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నా ఆర్ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది.’’ అంటూ షర్మిల తన ట్వీట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనల కంటే ప్రధాని మోదీని ఇంతలా మోయాలా? అంటూ నిప్పులు షర్మిల చెరిగారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా? అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి సిగ్గుపడాలి అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
బీజేపీతో అంటగాలా?
మీ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గుడ్డిగా తలాడించాలా ? మోదీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? ఇదేనా మీరు చెప్పే వైఎస్ఆర్ ఆశయాలు, వారసత్వం? అంటూ ప్రశ్నలు సంధించారు. మహానేత సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ షర్మిల హితవుపలికారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు.
ప్రజల గుండెలు గాయపరిచారు
దొంగ బిల్లులకు ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? కోట్లాది రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనం. దక్షిణాది రాష్ట్రాల బావోగ్వేదాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం? ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? జగన్ గారు చేసిన నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ నిజంగా ఘోషిస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి లింక్ పెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని తూర్పారబట్టారు.
కాంగ్రెస్ స్టాండ్ క్లియర్
ఇక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకించడం లేదని షర్మిల తన ట్వీట్ లో స్పష్టం చేశారు. అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒకటే. మహిళా బిల్లు పాస్ అయ్యింది 2023 లోనే అంటూ గుర్తు చేశారు. ప్రధాని మోదీ రాజకీయ లబ్ది కోసం పెట్టిన డీ లిమిటేషన్ బిల్లును మాత్రమే విపక్షాలు అడ్డుకున్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్టాండ్ క్రిస్టల్ క్లియర్ గా ఉందని షర్మిల తేల్చిచెప్పారు. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. కులగణన ద్వారా SC, ST, OBC ల సంఖ్య తేలాలి. కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలి. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలి అంటూ షర్మిల కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన బీజేపీకి వంత పాడుతున్నాయని, కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు.
