Begin typing your search above and press return to search.

లోక్ సభలో బాబు జగన్

లోక్ సభలో మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లుల మీద చర్చ సందర్భంగా ఏపీకి చెందిన రెండు ప్రాంతీయ పార్టీలు తమ అధినాయకుల గురించి ప్రస్తావన తీసుకుని రావడం విశేషం.

By:  Satya P   |   17 April 2026 6:22 PM IST
లోక్ సభలో బాబు జగన్
X

లోక్ సభలో మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లుల మీద చర్చ సందర్భంగా ఏపీకి చెందిన రెండు ప్రాంతీయ పార్టీలు తమ అధినాయకుల గురించి ప్రస్తావన తీసుకుని రావడం విశేషం. లోక్ సభలో టీడీపీ నాయకుడు లావు శ్రీక్రిష్ణ దేవరాయలు ఎన్టీఆర్ చంద్రబాబుల గురించి అనేక విషయాలు చెప్పారు. మహిళల విషయంలో ఆ ఇద్దరూ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు అని గుర్తు చేశారు. వైసీపీకి చెందిన సభా నాయకుడు మిధున్ రెడ్డి కూడా తమ నాయకుడు మాజీ సీఎం జగన్ అయిదేళ్ళ పాలనలో మహిళలకు పెద్ద పీట వేశారు అని చెప్పుకొచ్చారు. మిగిలిన పార్టీల ఎంపీలు బిల్లు గురించి మాత్రమే మాట్లాడితే ఏపీ రాజకీయ పార్టీల ఎంపీలు మాత్రం తమ అధినేతలను లోక్ సభలో కూడా ప్రస్తావించి మహిళా పక్షపాతి తమ నాయకుడే అని గట్టిగా చెపుకునే ప్రయత్నం చేయడం విశేషం.

ఎన్టీఆర్ టూ బాబు :

తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఎన్టీఆర్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు అని లావు తెలిపారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సగం వాటా దక్కేలా చట్టం చేయడంతో పాటు పద్మావతి విశ్వవిద్యాలయం వారి కోసం ఏర్పాటు చేశారని మహిళల పేరు మీదనే సంక్షేమ కార్యక్రమాలను అందించారని చెప్పారు. చంద్రబాబు అయితే డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళల ఆర్ధిక సాధికారత కోసం విశేషంగా కృషి చేశారు అని అన్నారు ఏ పధకం అయినా మహిలలకు దక్కాలనే బాబు చూశారని స్థానిక సంస్థలలో మహిలలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత బాబుదే అని ఆయన అన్నారు.

జగన్ కే క్రెడిట్ :

ఇక మిధున్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జగన్ ని చాంపియన్ గా చెప్పారు. మహిళల భద్రత కోసం చట్టాలని రూపొందించారని అలాగే స్థానిక సంస్థలలో 50 శాతం పైగా పదవులు వారికే కేటాయించారని నామినేటెడ్ పదవులు కాంట్రాక్టులలో కూడా మహిళలకు అవకాశం కల్పించారని చెప్పారు. ఏనాడో వైసీపీ మహిళా రిజర్వేషన్లు అమలు చేసింది అని మిధున్ రెడ్డి చెప్పారు.

టీడీపీ మీద విమర్శలు :

ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అంతటితో ఆగకుండా ఏపీలో మహిళల మీద లైంగిక దాడులు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేల మీద ఈ ఈ తరహా ఆరోపణలు ఉన్నాయని అయినా సరే చర్యలు లేవని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్లు మాత్రమే కాకుండా వారి పటిష్ట భద్రత కోసం చట్టలను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అంటూ :

అదే సమయంలో ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా ఆయన చేయడం విశేషం. ఇదే లోక్ సభలో ప్రత్యేక హోదా మీద ఆనాటి యూపీయే ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరలేదని అన్నారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ విహయంలో హామీలు నోటి మాటగా కాకుండ కచ్చితంగా అమలుకు నోచుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత సందర్భంగా కూడా మిధున్ రెడ్డి ప్రత్యేక హోదాని గుర్తు చేయడం విశేషం. కేవలం పదిహేను రోజుల తేడాలో రెండు సార్లు ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ లేవనెత్తడం వెనక వ్యూహం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా అన్నది ఇచ్చేది కాదు అని తేలిపోయినా వైసీపీ ఆ అంశాన్ని లేవనెత్తడం వెనక టీడీపీని కార్నర్ చేయడమే ఉందని ప్రచారం సాగుతోంది.