Begin typing your search above and press return to search.

దేవుడు అంటే భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు.. చంద్రబాబుపై జగన్ రెడ్డి ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి.

By:  Tupaki Political Desk   |   4 March 2026 3:53 PM IST
దేవుడు అంటే భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు.. చంద్రబాబుపై జగన్ రెడ్డి ఫైర్
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. కూటమి ప్రభుత్వంలో టీటీడీ కేంద్రంగా చెలరేగిన వివాదాలను ప్రస్తావిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. పరమపవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని రుజువైందని ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగన్ ఈ ట్వీట్ చేశారు. శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా నిరసన తెలుపుతున్న జగన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుండగా, సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు జగన్. ముఖ్యంగా ఇటీవల వైరల్ అయిన టీటీడీ చైర్మన్ వీడియోపై స్పందించిన జగన్ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం బాధ్యతలు నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారికి అప్పగించాల్సివుందని అభిప్రాయపడ్డారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలకు తిరుమలను వేదికగా మార్చారని ఆరోపించారు.

టీటీడీ ఛైర్మన్‌ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఓ మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని జగన్ వెల్లడించారు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబుగారు ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలున్నాయని తెలిసి కూడా ఆయననే (బీఆర్ నాయుడు) టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారంటూ జగన్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా

ముఖ్యమంత్రి కుటుంబ సంస్థ హెరిటేజ్ కు లబ్ధి చేయడానికి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేశారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

నెయ్యి క్వాలిటీ బాగోలేదని చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్‌ తిప్పి పంపిందని, కానీ మళ్లీ అదే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లను వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి తీసుకువచ్చారని జగన్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని సీబీఐ-సిట్‌ మొదటి ఛార్జిషీటు, ఫైనల్‌ ఛార్జిషీటులో స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చంద్రబాబుకి దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టారని జగన్ ధ్వజమెత్తారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330 మధ్య ఉందని, 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉందని వివరించారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ఇందాపూర్‌ డెయిరీకి నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేశారని జగన్ ఆరోపించారు. కిలో నెయ్యి రూ.658లకు అమ్ముకునేందుకు నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని, చంద్రబాబు సొంత ఆదాయం పెంచుకునేందుకు స్కాంలకు తెరలేపారని జగన్ రెడ్డి తన ట్వీట్ లో విమర్శించారు.