పొలిటికల్ స్క్రీన్ మీద జగన్ ప్రెజెన్స్ ఎంత ?
రాజకీయాలు అంటే నిరంతరం సాగే వ్యవహారం. పైగా జనంతో ముడిపడి ఉండే అతి పెద్ద విషయం. ఈ రాజకీయాలను చదరంగంతో పోలుస్తారు.
By: Satya P | 2 Nov 2025 8:00 AM ISTరాజకీయాలు అంటే నిరంతరం సాగే వ్యవహారం. పైగా జనంతో ముడిపడి ఉండే అతి పెద్ద విషయం. ఈ రాజకీయాలను చదరంగంతో పోలుస్తారు. అదే సమయంలో పారే నదితో పోలుస్తారు. నిరంతరం అవి మారుతూ పారుతూ ఉంటాయి. నిన్నటిది నిన్న, నేడు నేడే, రేపు రేపే అన్నట్లుగా జనంతో ఉంటుంది. ఇక ఇపుడు చూస్తే సోషల్ మీడియా యుగం. జనాలకు ఎంత వేగంగా రీచ్ కావచ్చో అంత స్పీడ్ గానే వారి మైండ్ నుంచి జారిపోవడం కూడా జరిగిపోతోంది. జనం మైండ్ లో ఉండాలి అంటే కళ్ళకు ఎదురుగానే కనిపించాలి, లేదా వినిపించాలి. లేదా పార్టీ గురించి ఎక్కడికక్కడ మోత మోగించాలి. కానీ వైసీపీలో జరుగుతున్నదేంటి అన్నదే ఇపుడు బిగ్ డిబేట్ గా ఉంది.
కూటమి మల్టీ స్టారర్ :
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో పెద్దగా అధినేతగా చంద్రబాబు ఉన్నారు. ఆయన జనాలకు ఎంతలా కనెక్ట్ అవుతారో వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఆయన తరువాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఉన్నారు ఆయన అతి పెద్ద సినీ సెలిబ్రిటీ. ఇపుడు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నారు. దాంతో పాటు పవన్ కూడా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ జనంలో ఉంటున్నారు. మూడవ వారు నారా లోకేష్. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా లోకేష్ ఉన్నారు. ఆయన కూడా మీడియా ఫ్లాట్ ఫారం మీద తన ప్రెజెన్స్ అంతా చూపిస్తున్నారు. ఆయన తన యాక్టివిటీస్ ద్వారా జనాలకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటున్నారు.
జగన్ వరకూ వస్తే :
వైసీపీకి అతి పెద్ద ఎట్రాక్షన్ జగన్ అని వేరేగా ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు అమితమైన ప్రజాదరణ ఉంది. ఆయన గత నెలలో విశాఖ పర్యటన చేపడితే జనాలు వానలో సైతం తరలి వచ్చారు. అయితే ఆ ప్రోగ్రాం తరువాత జగన్ మళ్ళీ బయటకు వచ్చింది లేదు. ఆయన లండన్ టూర్ చేపట్టారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత జగన్ ఒక మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసారు. ఆ మీదట తాడేపల్లి టూ బెంగళూర్ అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం పెద్దలు విమర్శిస్తున్నారు.
కీలక అంశాల మీద :
జగన్ కీలక అంశాల మీద నెలకు ఒకసారి అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ తరువాత ఆయన మళ్ళీ కనిపించడం లేదు. ఇక ఆయన జనంలోకి కూడా పెద్దగా రావడం లేదు. పార్టీ వారిని వెళ్లాలని ఆదేశిస్తున్నారు. పార్టీ వరకూ బాగానే ఉంది కానీ ఏపీలో బలమైన కూటమిని ఎదుర్కోవాలంటే జగన్ అపొజిషన్ లో ఉంటూ జనంలోకి రావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. జనాలకు వైసీపీ కంటే ముందే జగన్ పేరు వినిపిస్తుంది. జగన్ పార్టీ అంటారు కానీ వైసీపీని వేరేగా చెప్పారు నిజానికి ప్రాంతీయ పార్టీల బలం అంతా అధినాయకుడు వద్దనే ఉంటుంది.
షేర్ తీసుకోకుండా :
అలాంటిది జగన్ బయటకు రాకుండా పొలిటికల్ స్క్రీన్ మీద తనదైన షేర్ తీసుకోకుండా ఉంటే వైసీపీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అన్నదే పార్టీలోనూ బయటా చర్చగా ఉంది. జగన్ అయితే తాను అనుకున్న సమయానికి వస్తాను అప్పటిదాకా పార్టీని జనంలో ఉంచాలని భావిస్తున్నట్లుగా ఉంది. కానీ జనాల్లో వారి మైండ్ లో వైసీపీ రిజిస్టర్ కావాలంటే జగన్ రావాల్సిందే అని అంటున్నారు. విపక్షంలో ఉన్నపుడు ఒక నాయకుడి పొలిటికల్ ప్రెజెన్స్ ని చూపించేవి మీడియా సోషల్ మీడియాతో పాటు పర్యటనలే అని అంటున్నారు.
అంతా ఏకపక్షంగానే :
దూకుడుగా రాజకీయం చేయడం కూటమి ప్రభుత్వం విధానాల మీద ప్రజా పక్షంగా విమర్శలు చేయడం అవసరమైన సందర్భాలలో జనాలకు బాసటగా ఉంటానని భరోసా ఇవ్వడం ఇవన్నీ కావాల్సినంత చర్చ జనంలో జరిగేలా చేస్తాయి అని అంటున్నారు. అయితే జగన్ విషయం తీసుకుంటే ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఆయన ప్రెజెన్స్ అయితే అనుకున్నంతగా లేదని అంటున్నారు. తెల్లారి లేస్తే కూటమి అంతా మీడియాతో పాటు బయటా కనిపిస్తున్నారు. దాంతో అంతా ఏకపక్షంగానే సాగిపోతోంది. ఇదే కూటమిలో ధైర్యాన్ని పెంచుతూంటే వైసీపీలో ఒకింత నిరాశను కలుగచేస్తోంది అని అంటున్నారు.
