జగన్ పాదయాత్ర 2027 ఉండదా ?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మీదనే నాయకులు క్యాడర్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే జగన్ ఓటమి తరువాత పెద్దగా జనం లోకి వచ్చింది లేదు.
By: Satya P | 19 Jun 2026 12:00 AM ISTవైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మీదనే నాయకులు క్యాడర్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే జగన్ ఓటమి తరువాత పెద్దగా జనం లోకి వచ్చింది లేదు. అడపా తడపా టూర్లు తప్పించి జిల్లాలకు కూడా వెళ్ళింది లేదు. దీంతో వైసీపీ అధినేత రాక కోసం క్యాడర్ అయితే వేచి చూస్తోంది అనే చెప్పాలి. ముఖ్యంగా 2024 సిద్ధం సభల తరువాత జగన్ ఏపీ వ్యాప్తంగా తిరిగింది కూడా లేదు. దాంతో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా జగన్ రావాలని పార్టీ అయితే ఆరాటపడుతోంది.
జగన్ వ్యాఖ్యలతో డౌట్ :
ఇక జగన్ తాజాగా తాడేపల్లిలో పోలవరం జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తాను మరో ఏణ్ణర్థం తరువాత పాదయాత్ర మొదలుపెడుతున్నాను అని చెప్పారు. ఇపుడు చూస్తే 2026 జూన్. అంటే మధ్యలోకి ఈ ఏడాది వచ్చేసినట్లే. మరి ఈ అర్ధ ఏడాది, అలాగే 2027 ఏడాది పూర్తి అయిన తరువాతనే జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే జరిగితే 2028 లోనే పాదయాత్ర ఉండబోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది.
సుదీర్ఘమైనదేనా :
గతంలో జగన్ పాదయాత్ర చేసినపుడు 3,750 కిలోమీటర్ల దాకా నడిచారు. దానికి ఆయన 2017 నవంబర్ 6న శ్రీకారం చుడితే 2019 జనవరి 9న ముగించారు. అంటే కచ్చితంగా 14 నెలలు అన్న మాట. ఈసారి ఆ సమయం కంటే ఎక్కువగా జగన్ పాదయాత్ర ఉంటుందని ప్రచారం అయితే ఇంతదాకా జరుగుతూ వచ్చింది. జగన్ ఏకంగా అయిదు వేల కిలోమీటర్ల దాకా నడుస్తారు అని కూడా పార్టీలో వినిపించిన మాట. ఒకవేళ అంత దూరం నడవాలీ అంటే జగన్ ఇంకా ముందుగానే పాదయాత్ర మొదలెట్టాల్సి ఉంది. అపుడు 2027 తొలి అర్ధ భాగంలోనే జనంలోకి వెళ్లాలి. కానీ జగన్ మరో ఏణ్ణర్థం తరువాత అంటున్నారు. అంటే 2028 లోనే పాదయాత్ర ఉంటుందని చెప్పేశారా అని అంతా ఆలోచిస్తున్నారు.
తర్జన భర్జన :
పాదయాత్ర అన్నది జగన్ ఒకసారి చేసి సీఎం అయ్యారు. ఈసారి అంతకంటే ఎక్కువగా నడుస్తామని చెప్పినా ఆ ఇంపాక్ట్ తొలిసారి వచ్చినంత వస్తుందా అన్నది ఒక చర్చ. ఇక జగన్ మొదటిసారి పాదయాత్ర చేసినపుడు కేవలం వైసీపీ నాయకుడు మాత్రమే. ఇపుడు ఆయన మాజీ సీఎం హోదాలో పాదయాత్ర చేయబోతున్నారు. దాంతో ఆయన పాలనలో కూడా వైఫల్యాలను జనాలు ప్రశ్నిస్తారు. అలాగే ఆయన కొత్తగా ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ హయాం ని కూడా పోల్చి చూస్తారు. దాంతో పాదయాత్రకు క్రేజ్ తీసుకుని రావాలీ అంటే కొన్ని కీలక అంశాల మీదనే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే పాదయాత్ర సైజ్ తగ్గుతోందా అన్న చర్చ కూడా ఉంది.
వ్యూహాలు ముఖ్యం :
ఇక పాదయాత్ర కనుక సుదీర్ఘమైన సమయం జగన్ చేసుకుంటూ పోతే పార్టీ నిర్వహణ అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్టీ వ్యూహాలను కూడా రూపొందించుకోవాల్సి ఉంటుంది. పాదయాత్ర వంటి జనం వద్దకు వెళ్లే కార్యక్రమాలు ఉండాలి కానీ దానికి సరిసమానంగా పార్టీని పటిష్టంగా చేసి బూత్ ల వద్ద కూటమిని ఢీ కొట్టే విధంగా తయారు చేసే నిర్వహణ కూడా ముఖ్యమని అంటున్నారు. మరి ఇవన్నీ బేరీజు వేసుకున్న మీదటనే వైసీపీ అధినాయకత్వం ఎన్నికలకు ఒక ఏడాది ముందు మాత్రమే జనంలోకి వస్తే పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తోందా అన్నదే అంతా చర్చిస్తున్నారు.
