టెన్షన్ పెడుతున్న జగన్ నెల్లూరు టూర్
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు టూర్ షెడ్యూల్ ని ఆ పార్టీ ఈ మధ్యనే విడుదల చేసింది. జూలై 3న జగన్ తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్ లో నెల్లూరు వెళ్తారు.
By: Tupaki Desk | 30 Jun 2025 12:18 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు టూర్ షెడ్యూల్ ని ఆ పార్టీ ఈ మధ్యనే విడుదల చేసింది. జూలై 3న జగన్ తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్ లో నెల్లూరు వెళ్తారు. అక్కడ జైలులో ఉన్న మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన ములాకత్ ద్వారా పరామర్శిస్తారు.
కాకాణి అరెస్టు అయి జైలు జీవితం గడుపుతున్నారు చాలా రోజులుగా ఆయన కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఈ నేతను పరామర్శించేందుకు ఆయన నెల్లూరు వస్తున్నారు. అయితే జగన్ నెల్లూర్ టూర్ మీద అపుడే చర్చ మొదలైంది. ఆయన హెలికాప్టర్ ని నెల్లూరు ల్యాండ్ కానీయకుండా టీడీపీ నేతలు చూస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇతర వైసీపీ నేతలు జగన్ ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ కోసం ప్రైవేట్ స్థలాన్ని చూస్తున్నారు. అలా మూడు కీలక ప్లేస్ లను ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకదానిని ఖాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటూండంగా ఆయా స్థలాల యజమానులకు టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని తమ భూమిలో జగన్ హెలికాప్టర్ ల్యాండ్ చేయనీయవద్దని వారిని కోరారని అంటున్నారు.
ఈ విషయంలో నయాన భయాన కూడా వారి మీద టీడీపీ నేతలు ఒత్తిళ్ళు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చిత్రమేంటి అంటే వైసీపీలో ఉంటూ జగన్ ని దేవుడిగా తనను తాను భక్తుడుగా చిత్రీకరించుకుని 2022 తరువాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఈ విధంగా చేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది.
అధినాయకత్వం వద్ద మెప్పు పొందేందుకే ఇలా చేస్తున్నారు అని జగన్ వంటి ప్రతిపక్ష నేత పర్యటనకు ఆటంకాలు తెస్తున్నారని అంటున్నారు. దీంతో జగన్ రాక ముందే నెల్లూరు టూర్ టెన్షన్ లో పడుతోంది. ఇక చూస్తే జూన్ నెలలో వరసగా ప్రకాశం జిల్లా పొదిలి, అలాగే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళలలో జగన్ చేసిన టూర్లు పొలిటికల్ గా హీటెక్కించాయి.
పొదిలిలో అయితే టీడీపీ వారి మీద పోలీసుల మీద వైసీపీ క్యాడర్ రాళ్ళు రువ్వారని కేసులు సైతం నమోదు చేశారు. ఇక రెంటపాళ్ళ లో అయితే ఏకంగా జగన్ కారు కిందనే సింగయ్య అనే వృద్ధుడు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని రచ్చ రచ్చ జరిగింది. దీని మీద ఏకంగా జగన్ నే ఏటూ గా చేసి పోలీసులు కేసులు పెట్టారు.
ఈ నేపధ్యంలో జగన్ నెల్లూరు టూర్ ఖరారు అయింది. ఈసారి జగన్ పర్యటనకు హెలికాప్టర్ నే ల్యాండ్ కానీయకుండా చేస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. ఇక జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కానీయకపోతే ఏకంగా తాడేపల్లి టూ నెల్లూరు దాకా జగన్ కార్లతోనే రోడ్డు మార్గం ద్వారా వస్తారు తప్ప ఆయన టూర్ రద్దు అయ్యే ప్రసక్తి లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
జగన్ పట్టుదల ముందు టీడీపీ నేతలు తాటాకు చప్పుళ్ళు చేస్తే అవి కుదిరేవి కాదని అంటున్నారు. ఇలా వైసీపీ వర్సెస్ టీడీపీగా నెల్లూరు రాజకీయం వేడెక్కుతోంది. మరి జూలై మూడున ఏమి జరుగుతుంది అన్నదే అంతటా చర్చగా ఉంది.
