‘జగన్ 2.0’.. కార్యకర్తల కోసం సూపర్ యాప్
పార్టీ కంటెంట్ ను రక్షించుకోవడం, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ రూప్ రూపొందించినట్లు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 16 July 2026 5:40 PM ISTకార్యకర్తల కోసం వైసీపీ సరికొత్తగా 'జగన్ 2.0 సూపర్ యాప్'ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను గురువారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అదే సమయంలో కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జగన్ 2.0 యాప్ ను ఆవిష్కరించారు. పార్టీ కంటెంట్ ను రక్షించుకోవడం, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ రూప్ రూపొందించినట్లు చెబుతున్నారు.
సోషల్ మీడియా వేదికల్లో పార్టీ శ్రేణులపై జరుగుతున్న అనుచిత విమర్శలు, అసభ్యకరమైన వీడియోలు, కామెంట్లను ఎదుర్కొనేందుకు ఈ యాప్ కీలకంగా పనిచేస్తుందని వైసీపీ వర్గాలు ప్రకటించాయి. వేధింపులు ఎదుర్కొనే కార్యకర్తలు ఈ యాప్‌లోని 'డిజిటల్ డైరీ' ద్వారా నేరుగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చునని చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి, ఫిర్యాదు చేసిన కంటెంట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవడానికి ఈ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఎవరూ ఆపలేని విధంగా, పార్టీ సొంతంగా దీనిని అభివృద్ధి చేసిందని చెబుతున్నారు.
ఈ సూపర్ యాప్ ద్వారా పార్టీలోని ప్రతి కార్యకర్త నిత్యం పార్టీ నాయకత్వంతో కనెక్ట్ అయి ఉంటారని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉండటమే ఈ యాప్ ఆవిష్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల భద్రత, మనోధైర్యాన్ని పెంచేందుకు ఈ యాప్ ఒక బలమైన సాధనంగా మారుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఈ యాప్ లో అప్ లోడ్ చేయడం ద్వారా కేడర్ మధ్య సమన్వయం పెంచొచ్చని అధిష్టానం భావిస్తోంది.
ఆ నిర్ణయంలో మార్పులేదు
ఇక పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనపై మద్దతు ఇవ్వాలని గత నిర్ణయానికి కట్టుబడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో వెనక్కి తగ్గ కూడదని, మహిళా రిజర్వేషన్లు తమ పార్టీ విధానమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు నియోజకవర్గ పునర్విభజనపై దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ఇక మిగిలిన బిల్లులపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని మాజీ సీఎం జగన్ రెడ్డి ఎంపీలకు సూచించారు.
