Begin typing your search above and press return to search.

ఫ్లెక్సీ చినిగింది.. ఆ యువకుడు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది!

ఏపీ హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:07 AM GMT
ఫ్లెక్సీ చినిగింది.. ఆ యువకుడు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది!
X

విన్నంతనే.. చదివినంతనే విస్మయానికి గురయ్యే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఎంత అధికార పార్టీ అయితేనేం.. ఫ్లెక్సీ చినిగిన అంశం ఒక వివాదంగా.. దానికి బాధ్యులుగా ఆరోపణలు ఒక యువకుడి మీద పెట్టటం.. అతగాడికి చూపిన టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకునే వరకు విషయం వెళ్లటం షాకివ్వటం ఖాయం. ఏపీ హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్త ఉద్రిక్తతకు కారణమైన ఈ ఉదంతంలోకి వెళితే.

కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ నెల ఆరున గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హోం మంత్రి వనిత హాజరయ్యారు. హోం మంత్రి వస్తున్న వేళలో.. ఆమెకు స్వాగతం పలుకుతూ స్థానిక నేతలు నాగరాజు.. సతీష్ తదితరులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేవారు. అందులో నాగరాజు.. సతీష్ ముఖాల్ని ఎవరు కత్తిరించారు. దీంతో.. వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో 13న కొవ్వూరు పట్టణ ఎస్ఐ భూషణం దొమ్మేరు వెళ్లారు. ఫ్లెక్సీ చిరిగిన వివాదంపై విచారణ జరిపారు.

23 ఏళ్ల మహేంద్ర అనే యువకుడి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి గురించి జడ్పీటీసీ సభ్యురాలు బొంతా వెంకటలక్ష్మి భర్త పోశిబాబుకు ఫోన్ చేసి.. మహేంద్ర గురించి ఆరా తీశారు. పోశిబాబు అన్న కొడుకైన మహేంద్ర కూడా వైసీపీలోనే ఉన్నారు. పోశిబాబు సూచనతో మహేంద్రను కొవ్వూరు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఫ్లెక్సీ విషయమై ఎస్ఐ అతడ్ని ప్రశ్నించారు. ఎస్ఐ చర్యను తప్పు పడుతూ మహేంద్ర కుటుంబ సభ్యులు.. మద్దతుదారులు స్టేషన్ కు వెళ్లటంతో అతడ్ని సాయంత్రం వేళలో విడిచిపెట్టారు.

ఇంటికి వెళ్లిన మహేంద్ర తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడ్ని తీసుకొని విజయవాడ ఆసుపత్రికి వెళుతుండగా.. దారి మధ్యలో అతడి ప్రాణాలు పోయాయి. మహేంద్ర ఆత్మహత్య గురించి తెలిసినంతనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పోలీసుల తీరును తప్పు పడుతూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న వారిని పోలీసులు శాంతింపచేశారు. ఇదిలా ఉండగా.. రాత్రి పదిన్నర గంటల వేళలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై రాళ్లు.. సీసాల్ని విసిరారు. ఈ ఉదంతంలో అదనపు ఎస్పీ (క్రైం) వెంకటేశ్వరరావుకు గాయమైంది. ఆయన్ను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు అక్కడున్న గుంపును చెదరగొట్టారు.

మహేంద్ర గురించి జెడ్పీటీసీ సభ్యురాలికి.. హోంమంత్రికి చెప్పినా సమయానికి స్పందించలేదని.. అందుకు నిరసనగా అతడి డెడ్ బాడీని తీసుకొని హోంమంత్రి పాల్గొంటున్న కార్యక్రమం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన సోదరుడి మరణానికి కారణం పోలీసులు.. మరోఇద్దరు నేతలంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏలూరు డీఐజీ .. స్థానిక ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చిన్న విషయాల్ని సున్నితంగా డీల్ చేయటానికి బదులు.. మొరటుగా డీల్ చేస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయన్న మాట వినిపిస్తోంది.