వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్...టీడీపీ నుంచి బిగ్ షాట్స్...?
మరో వైపు పొత్తులు ఎత్తుల మూలంగా టీడీపీలో టికెట్ రాని వారు వైసీపీకి టచ్ లోకి వస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 1 Aug 2023 8:15 AM ISTఎన్నికలు దగ్గర పడుతున్నా వేళ అటు నుంచి ఇటూ అలాగే ఇటు నుంచి అటూ పెద్ద ఎత్తున నాయకులు చేరుతూ ఉంటారు. విధేయత అన్నది రాజకీయాల్లో నేతి బీరకాయ చందమే. తమకు ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ నేతలు చేరుతారు. టికెట్ రాకపోతే అప్పటిదాకా ఉన్న పార్టీని సైతం పక్కన పెట్టి రాత్రికి రాత్రి కొత్త పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే.
జనాలు సైతం లైట్ తీసుకునే వ్యవహారమే. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ వైసీపీని టర్గెట్ చేస్తోంది. అధికార పార్టీలో చాలా మందికి టికెట్ గల్లంతు అవుతుంది కాబట్టి వారంతా వచ్చి తమ పార్టీలో చేరుతారు అని భావిస్తోంది. జనసేన కూడా ఇదే రకమైన ఆలోచనలలో ఉంది.
అయితే వైసీపీ వీరికి ఏ మాత్రం తీసిపోవడంలేదు. ఒక మెట్టు పైన కూడా ఉంది. వైసీపీకి కూడా చాలా మంది ప్రతిపక్ష నేతలు టచ్ లోకి వస్తున్నారుట. వారిలో బిగ్ షాట్స్ ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గినా మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
దాంతో పాటు వైసీపీలో కూడా ధీమా పెరిగింది అని అంటున్నారు. మరో వైపు పొత్తులు ఎత్తుల మూలంగా టీడీపీలో టికెట్ రాని వారు వైసీపీకి టచ్ లోకి వస్తున్నారు అని అంటున్నారు. అలాగే కొన్ని కీలక స్థానాలలో ఎంపీలుగా పోటీ చేసేందుకు కూడా పెద్ద తలకాయలు ఈ వైపు చూస్తున్నాయని అంటున్నారు.
దాంతో అలా వచ్చే వారిని చేర్చుకునేందుకు వైసీపీ ఒక వ్యూహాన్ని రూపొందించింది అని తెలుస్తోంది. ఒక్కసారిగా నాయకులను తీసుకోకుండా దశల వారీగా వారిని చేర్చుకోవడం ద్వారా వైసీపీకి జనంలో ఊపు ఉందని తెలియచెప్పడమే ఆ పార్టీ ఆలోచనగా ఉంది అని తెలుస్తోంది. కీలక స్థానాలలో బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ కొట్టడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీసింది అని అంటున్నారు. నిజంగా పొత్తులు కుదిరితే మాత్రం టీడీపీలో చాలా మంది ఆశావహులకు ఉత్త చేయి మిగులుతుంది. అదే విధంగా కొందరికి పార్లమెంట్ కి వెళ్లాలని ఉంది. అలాంటి వారు ఇపుడు వైసీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం గ్రాఫ్ అనుకున్న విధంగా పెరగకపోవడం కూడా కొందరిని ఆలోచనలో పడేస్తోంది అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో టీడీపీ మీదనే వైసీపీ గురి పెట్టేసింది అని అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీలోకి దూకే నాయకులు వరసబెట్టి వెలుగులోకి వస్తారు అని అంటున్నారు. ఇక జెండా కప్పే కార్యక్రమానికి వైసీపీ రెడీ అవుతోంది అని తెలుస్తోంది.
