Begin typing your search above and press return to search.

చంద్రబాబును తాత అంటూ వైసీపీ నేత సంచలన లేఖ!

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నవారి స్థానంలో వారి వారసులు సీట్లు దక్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 7:05 AM GMT
చంద్రబాబును తాత అంటూ వైసీపీ నేత సంచలన లేఖ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొందరిని ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నవారి స్థానంలో వారి వారసులు సీట్లు దక్కించుకున్నారు.

ఈ క్రమంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేయనున్నారు. మోహిత్‌ రెడ్డి ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోహిత్‌ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.

కాగా చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లను నమోదు చేశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని తాతా అని సంబోధించిన ఆయన చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని కోరారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు ఉంటే నామినేషన్‌ కూడా వేయనని సవాల్‌ విసిరారు. దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ తమకు ఎప్పుడూ పట్టలేదన్నారు. వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలతోనే తాము విజయం సాధిస్తానన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు మోహిత్‌ రెడ్డి లేఖ రాశారు.

‘పెద్దలైన చంద్రబాబు తాతకు మీ మనవడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి నమస్కరించి రాయునది ఏమనగా.. మా తాత, మీరు కలిసి చదువుకున్నారు. అంటే మీరు నాకు తాతలాంటి వారు. చంద్రబాబు తాతా మీరు రాజకీయాల్లోకి వచ్చాక 20 ఏళ్లకు నేను పుట్టాను. ఈ రోజు మీ ప్రెస్‌ మీట్, ఎన్నికల కమిషన్‌ కు చేసిన ఫిర్యాదు చూసి ఆశ్చర్యపోయాను. అపార రాజకీయ అనుభవం ఉన్న మీరు నిజానిజాలు తెలుసుకోకుండా చంద్రగిరిలో లక్ష ఓట్లు నమోదు చేశారని ఫిర్యాదు చేయడం, ప్రెస్‌ మీట్‌ పెట్టి అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధాకరం’ అంటూ మోహిత్‌ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు.

‘2019 ఎన్నికలప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రగిరిలో ఉన్న మొత్తం ఓట్లు 2,91,734. ప్రస్తుతం 3,08,672 మాత్రమే. కేవలం అప్పటికి, ఇప్పటికి ఈ ఐదేళ్లలో పెరిగింది 16,000 మాత్రమే. ఈ ఐదేళ్లలో చంద్రగిరిలో కొత్త ఇళ్ల నిర్మాణం జరిగినప్పుడు ఆ మాత్రం ఓట్లు పెరగకుండా ఎలా ఉంటాయి? నిజంగా దొంగ ఓట్లను చేరిస్తే 3,91,000 ఓట్లు అవ్వాలి కానీ 3,08,672 మాత్రమే ఎందుకుంటాయి? మా తాత వయసున్న మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదని విజ్ఞప్తి చేస్తున్నా. 2023 నవంబర్‌ లో నాలుగు రోజుల్లోనే టీడీపీ వారు 14,200 దొంగ ఫారంలు నింపి దరఖాస్తు చేశారు. ఎన్నికల కమిషన్‌ విచారణ చేస్తే చాలా మంది టీడీపీ నేతలు అరెస్ట్‌ అవుతారు. అసత్య ఆరోపణలు చేసిన అందరిపైనా పరువు నష్టం వేస్తున్నాను. తద్వారా వారిని న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి అవాస్తవాలు చెబితే నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాటం చేస్తాను. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడను. మీరు సీఎంగా ఉన్నప్పుడే మా నాన్న భాస్కరరెడ్డి 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాంటిది దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం మాకేంటి’ అంటూ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆ లేఖలో ధ్వజమెత్తారు.