ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీలో చేరకముందే అసమ్మతి పోటు!
ఈ నేపథ్యంలో టీడీపీలో చేరాలనుకుంటున్నవారికి స్థానికంగా టీడీపీలో ఉండి సీట్లు ఆశిస్తున్నవారి నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
By: Tupaki Desk | 27 Feb 2024 12:49 PM ISTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న మార్పులు నచ్చనివారు టీడీపీలో చేరిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరాలనుకుంటున్నవారికి స్థానికంగా టీడీపీలో ఉండి సీట్లు ఆశిస్తున్నవారి నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు కీలక నియోజకవర్గాల్లో టీడీపీలో చేరాలనుకుంటున్న నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అయితే మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమాను విజయవాడను ఆనుకుని ఉన్న పెనమలూరుకు పంపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో మైలవరం టీడీపీ టికెట్ ను స్థానిక టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఆశిస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమని బొమ్మసాని సుబ్బారావు తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు.. బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. తన కుమారుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే ఈ ప్రతిపాదనను బొమ్మసాని తిరస్కరించారు.
ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్ సైతం మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలందరినీ కలుస్తానని.. వారి మద్దతు కోరతానని వెల్లడించారు. దేవినేని ఉమాపైన కూడా తాను రాజకీయపరమైన విమర్శలు చేశానే తప్ప ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు.
మైలవరంలో ఉన్న పరిస్థితే పెనమలూరు నియోజకవర్గంలోనూ ఉంది. ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని వైఎస్ జగన్ ఈసారి బందరు ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని కోరారు. అయితే ఇది నచ్చని పార్థసారధి టీడీపీలో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 26న నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.
పెనమలూరు సీటును తనకు కాకుండా మరెవరికైనా కేటాయిస్తే చేతులు ముడుచుకు కూర్చోబోనని మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు ప్రస్తుత టీడీపీ ఇంచార్జి బోడె ప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పార్థసారధిని నూజివీడు స్థానం నుంచి చంద్రబాబు ఎన్నికల బరిలో నిలబెట్టారు.
పెనమలూరు సీటును మైలవరం ఇంచార్జిగా దేవినేని ఉమాకు కేటాయిస్తారని అంటున్నారు. దీంతో బోడె ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరిద్దరికి తోడు దివంగత టీడీపీ నేత చలసాని పండు కుమార్తె చలసాని స్మిత కూడా టికెట్ ను ఆశిస్తూ ప్రచారం చేస్తున్నారు.
కొలుసు పార్థసారధి తాజాగా టీడీపీలో చేరగా వసంత కృష్ణప్రసాద్ చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసమ్మతి పోరును చల్లార్చడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో, లేదో వేచిచూడాల్సిందే.
