సింగయ్య భార్యను బెదిరించారు.. చంద్రబాబు సీరియస్
పార్టీ అధినేత జగన్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సింగయ్య భార్య లూర్దు మేరి సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 3 July 2025 6:33 PM ISTవైసీపీ కార్యకర్త సింగయ్య మరణం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. గత నెల 18న మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు బైపాస్ లోని ఏటుకూరు వద్ద సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మరణించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్ పై పూలు జల్లేందుకు వెళ్లిన సింగయ్య ఆయన కారు కింద పడి మరణించినట్లు ప్రభుత్వం వీడియోలు విడుదల చేసింది. దీనిపై తమకు అనుమానాలు ఉన్నట్లు మృతుడి భార్య లూర్దా మేరి ప్రకటన చేశారు. అయితే ఆమె అలా మాట్లాడటానికి మాజీ సీఎం జగనే కారణమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగయ్య మరణించి దాదాపు 15 రోజులు గడుస్తున్నా, ఆయన మృతికి కారణమైన ప్రమాదంపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తొలుత ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు ఏఐ జనరేటడ్ వీడియోలు అని వైసీపీ సందేహం వ్యక్తం చేసింది. తాజాగా మృతుడి కుటుంబ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో తన నివాసానికి బాధితులను రప్పించుకున్న జగన్ పరామర్శించారు.
పార్టీ అధినేత జగన్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సింగయ్య భార్య లూర్దు మేరి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మంత్రి లోకేశ్ మనుషులు తమ ఇంటికి వచ్చి తాము చెప్పమన్నట్లు చెప్పాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా తాము జగన్ అభిమానులమని, ఆయన తమకు అండగా ఉంటారని చెప్పారు. కారు కింద పడిన సింగయ్యకు చిన్నచిన్న గాయాలే తగిలాయని, అంబులెన్సులోనే ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇక సింగయ్య భార్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికం.. చేసిన పనులే శాశ్వతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. కంప చెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా? అని ప్రశ్నిస్తున్నా.. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
