Begin typing your search above and press return to search.

జమిలిని నమ్ముకుని జగన్ అతి పెద్ద నిర్ణయం!

దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని ఎవరూ అనుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:00 AM IST
జమిలిని నమ్ముకుని జగన్ అతి పెద్ద నిర్ణయం!
X

దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని ఎవరూ అనుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎపుడూ పూర్తి స్థాయిలోనే అధికారం చలాయించింది. అయితే వాజ్ పేయి హయాంలో మాత్రం ఆరు నెలల అధికారం చేతిలో ఉండగానే ముందస్తు ఎన్నికలకు 2004లో వెళ్ళింది. షైనింగ్ ఇండియా అంటూ భారీ స్లోగన్ తో వెళ్ళినా పెద్ద షాక్ ని ఓటర్లు ఇచ్చారు.

అలా రెండు ఎన్నికల్లో బీజేపీ ఓడి అధికారానికి దూరం అయిన తర్వాత ముందస్తుని స్వస్తి పలికింది. అందుకే నరేంద్ర మోడీ ఏలుబడిలో 2019 ముందు 2024 ముందు కూడా ముందస్తు ఎన్నికలు అని ప్రచారం సాగినా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ మరోసారి ఎలా గెలవాలో చూస్తుంది అని అంతా చెబుతారు.

అయితే దేశంలో జమిలి ఎన్నికలు అన్న నినాదం మాత్రం బీజేపీ వదిలిపెట్టదు. దాంతో ప్రతిపక్షాలలో ముఖ్యంగా అధికారం కోల్పోయిన వారిలో ఆశలు అయితే బీజేపీ ఇలా పెంచేస్తోంది. ఇక జన గణన షెడ్యూల్ ని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విడుదల చేయడంతో మరోసారి జమిలి ఎన్నికల మీద చర్చ మొదలైంది.

దేశంలో 2027 చివరిలో కానీ 2028 మొదట్లో కానీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలను అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వాములు కూడా అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారమే 2029లో ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూడా మరో నాలుగేళ్ల పాటు అధికారం ఉందని భావిస్తూనే తమ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు.

అయితే విపక్షంలో ఉన్న జగన్ మాత్రం జమిలి ఎన్నికలు వస్తాయనే గట్టిగా భావిస్తున్నారు. దాంతో ఆయన ఎన్నికలు ముందుగా వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీదనే కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే తగిన వ్యూహాలకు కొత్త టీం ని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీకి 2019 ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని ఐప్యాక్ టీం సాయం చేసింది.

ఇక 2019లో అధికారంలోకి వచ్చాక రిషి నాయకత్వంలోని ఐప్యాక్ టీం పనిచేసింది. ఐతే 2024 ఎన్నికల్లో రిషి రాజ్ సింగ్ టీం వైసీపీని గెలిపించలేకపోయింది. సరికదా పూర్తిగా 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది. దాంతో రిషి రాజ్ సింగ్ టీం కి స్వస్తి పలికి కొత్త వ్యూహకర్త కోసం వైసీపీ చూస్తోంది అన్న ప్రచారం కూడా సాగింది.

ఇదిలా ఉంటే బెంగళూరు నుంచే జగన్ కొత్త ఎన్నికల వ్యూహకర్త అన్వేషణలో ఉన్నారని ఈ మధ్య అంతా అనుకున్నారు. అయితే ఆ అన్వేషణ ఫలించింది అని జగన్ కొత్త వ్యూహకర్త ఆమె కానీ అతడు కానీ కావచ్చు అని అంటున్నారు. అతడు అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన సునీల్ కనుగోలు అని అంటున్నారు.

ఆయన చాలా పవర్ ఫుల్ గా వ్యూహాలను రచిస్తారు అని అంటున్నారు. బలమైన కేసీఅర్ సర్కార్ ని తెలంగాణాలో గద్దె దించడం వెనక ఆయన స్ట్రాటజీ ఉందని అంతా నమ్ముతారు. ఇక ఆయననే జమిలి ఎన్నికల కోసం జగన్ రప్పిస్తున్నారు అని అంటున్నారు. ఆయన అయితేనే వైసీపీని ఒడ్డున పడేసే కొత్త వ్యూహాలను పన్నగలరని అలాగే టీడీపీ కూటమిని వ్యతిరేకంగా ప్రచారాన్ని పీక్స్ కి చేర్చగలరని విశ్వసిస్తున్నారు.

ఒకవేళ ఆయన కాకపోతే రిషి రాజ్ సింగ్ టీం లో చాలా చురుకైన పాత్ర నిర్వహించి ఇటీవలనే తప్పుకున్న ఒక యంగ్ డైనమిక్ లేడీ న్యూ టాలెంటెడ్ స్ట్రాటజిస్ట్ అయిన ఆమెను తీసుకుంటారని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని తొందరలోనే జగన్ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఏడాదిలోనే టీడీపీ కూటమి మీద ప్రజలలో వ్యతిరేకత మొదలైంది అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం జమిలి ఎన్నికలు పక్కాగా జరుగుతాయని భావిస్తోంది. దాంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు.