Begin typing your search above and press return to search.

టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత!

కాగా ఆయా పార్టీల తరఫున సీట్లు లభించనివారు వేరే పార్టీల్లో చేరిపోతున్నారు.

By:  Tupaki Desk   |   10 April 2024 1:41 PM GMT
టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత!
X

ఆంధ్రప్రదేశ్‌ లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కాగా ఆయా పార్టీల తరఫున సీట్లు లభించనివారు వేరే పార్టీల్లో చేరిపోతున్నారు.

తాజాగా అధికార వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఐపీఎస్‌ అధికారి అయిన మహ్మద్‌ ఇక్బాల్‌ గతంలో చంద్రబాబుకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గానూ పనిచేశారు. అనంతరం టీడీపీలో చేరారు. మళ్లీ కొన్నేళ్ల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ అయ్యారు.

2014లో డీఐజీగా పదవీ విరమణ చేశాక ఇక్బాల్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా చాన్సు దక్కించుకున్నారు. హిందూపురం నుంచి 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి ప్రముఖ సినీ నటుడు, టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి మహ్మద్‌ ఇక్బాల్‌ హిందూపురం వైసీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆయనను ఎమ్మెల్సీని చేశారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మహ్మద్‌ ఇక్బాల్‌ కు సీటు దక్కలేదు. హిందూపురం సీటును దీపిక అనే కొత్త అభ్యర్థికి ఇచ్చారు. దీంతో ఇక్బాల్‌ కు సీటు లేకుండా పోయింది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న ఇక్బాల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఇక్బాల్‌ ఆ లేఖలను సీఎం జగన్, మండలి చైర్మన్‌ కు పంపారు.