Begin typing your search above and press return to search.

జగన్ హీరో - తారక్ ఆకాశం... తెరపైకి లోకేష్ పెళ్లి ముచ్చట!

దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా జరిగిన రచ్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Jan 2024 7:47 AM GMT
జగన్ హీరో - తారక్ ఆకాశం... తెరపైకి లోకేష్ పెళ్లి ముచ్చట!
X

దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా జరిగిన రచ్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసెయ్యాలంటూ బాలకృష్ణ హుకుం జారీచేశారంటూ ఆవేదన చెందుతున్న ఆయన ఫ్యాన్స్ కు భారీస్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందించారు.

అవును... తాజాగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయంలో బాలయ్య చేసిన చేష్టలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది అని మొదలుపెట్టిన లక్ష్మీప్రసాద్... తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదని, అతడిపై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. ఇదే సమయంలో... జూనియర్ ఎన్టీఆర్‌ ను అతడి తల్లి.. శివాజీని జిజియా బాయి ఎలా పెంచిందో అలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు.

ఇదే సమయంలో నిన్నైనా, రేపైనా జగన్ విజయానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అని మొదలుపెట్టిన లక్ష్మీప్రసాద్... అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయమని, అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్ అని అన్నారు. ఈ సందర్భంగా జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా చాలా అభిమానమని, తనను ఆయన ఆయన సతీమణి ఎంతో గౌరవించేవారని యార్లగడ్డ తెలిపారు.

ఇదే సమయంలో జగన్ పై పిచ్చికేసులుపెట్టి.. 16 నెలలు జైల్లో పెట్టి.. బెయిల్ రాకుండా చేశారని.. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి సింగిల్ హ్యాండ్ తో 151 మంది ఎమ్మెల్యేలను 23 మంది ఎంపీలను గెలిపించుకున్నాడని ప్రశంసించారు. ఇదే సమయంలో భారతదేశ రాజకీయాల్లో... తాను మంచి చేశానని భావిస్తేనే ఓటు వేయండని కోరిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.

లోకేష్ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు!:

ఇలా జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ జగన్ లపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ సందర్భంగా... లోకేష్ పెళ్లి విషయంలో జరిగిన ఒక సందర్భాన్ని పంచుకున్నారు! ఇందులో భాగంగా బాలకృష్ణ కుమార్తెతో లోకేష్ పెళ్లి ప్రస్థావన తెచ్చినప్పుడు చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ని ఆయన వెల్లడించారు!

ఇందులో భాగంగా... గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్‌ కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబును అడిగినప్పుడు..." నాన్సెన్స్" అని నన్ను చంద్రబాబు తిట్టారని, మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారని.. ఆ తర్వాత తిరిగి లోకేష్‌ కు బాలకృష్ణ కూతురినిచ్చే చంద్రబాబు వివాహం చేశారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.