Begin typing your search above and press return to search.

రోబోల కిక్ బాక్సింగ్ వైరల్.. పంచ్‌లు, కిక్‌లతో అదరగొట్టిన చిట్టి రోబోలు!

ఈ ప్రత్యేకమైన కిక్ బాక్సింగ్ పోటీ చైనా మీడియా గ్రూప్ నిర్వహించిన 'వరల్డ్ రోబోబ్ కాంపిటీషన్ సిరీస్లో భాగంగా జరిగింది.

By:  Tupaki Desk   |   27 May 2025 8:00 AM IST
రోబోల కిక్ బాక్సింగ్ వైరల్.. పంచ్‌లు, కిక్‌లతో అదరగొట్టిన చిట్టి రోబోలు!
X

ప్రపంచం టెక్నాలజీతో దూసుకెళ్తోంది. మనుషులు చేసే పనులన్నీ ప్రస్తుతం రోబోలు చేస్తున్నాయి. ఆటల్లోనూ రోబోలు తమ సత్తా చాటుతున్నాయి. తాజాగా చైనాలోని హాంగ్‌లో జరిగిన ఒక సంచలనం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'హ్యూమనాయిడ్ కిక్ బాక్సింగ్ పోటీ'ని అక్కడ నిర్వహించారు. రింగ్‌లో చిట్టి చిట్టి రోబోలు ఒకదానిపై మరొకటి పంచ్‌లు విసురుకుంటూ, కాలితో తన్నుకుంటూ అదరగొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడుతున్నారు. ఇది కేవలం సాంకేతిక విన్యాసం మాత్రమే కాదు. భవిష్యత్తులో ఆటలు ఎలా ఉండబోతున్నాయో చెప్పేందుకు ఓ ఉదాహరణ కూడా.

ఈ ప్రత్యేకమైన కిక్ బాక్సింగ్ పోటీ చైనా మీడియా గ్రూప్ నిర్వహించిన 'వరల్డ్ రోబోబ్ కాంపిటీషన్ సిరీస్లో భాగంగా జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న రోబోలు కేవలం ఆటబొమ్మల్లా లేవు, అవి నిజమైన మనుషుల మాదిరిగానే తమ చేతులను పిడికిలిగా బిగించి గుద్దుకోవడం, కాళ్ళతో బలంగా తన్నుకోవడం చేశాయి. వాటి కదలికలు, పంచ్‌ల వేగం, సమన్వయం చూస్తుంటే ఇవి రోబోలా? నిజమైన బాక్సర్లా? అన్న అనుమానం వస్తుంది. ఈ రోబోలను అత్యంత అధునాతన సాంకేతికతతో తయారు చేశారు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అవి ప్రత్యర్థి కదలికలను అంచనా వేసి, దానికి తగ్గట్టుగా తమ దాడులను, రక్షణను ప్లాన్ చేసుకున్నాయి. మనుషులు నియంత్రించకుండా రోబోలే సొంతంగా ఈ పోటీలో పాల్గొనడం నిజంగా టెక్నాలజీ సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఈ పోటీలో లు జిస్ అనే కంపెనీకి చెందిన 'AI స్ట్రాటజిస్ట్' అనే రోబో ఛాంపియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తన బలమైన పంచ్‌లు, వేగవంతమైన కిక్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేసింది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా విస్తరించింది. రోబోలు బాక్సింగ్ చేస్తూ, పంచ్‌లు విసురుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను విస్మరించాయి. చాలా మంది యూజర్లు ఇది కచ్చితంగా భవిష్యత్తు.. రోబోలు ఆటల్లోకి కూడా వచ్చేశాయని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు "మనుషుల అవసరం లేకుండా రోబోలే ఆటలాడుకుంటే ఎలా?" అని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఈ పోటీ భవిష్యత్తులో రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు ఆటలు, వినోద రంగంలో ఎంత దూరం వెళ్లగలవో చూపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినవి ఇప్పుడు నిజమవుతున్నాయని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోటీ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చైనా సాధించిన ప్రగతికి కూడా ఇది ఒక నిదర్శనం.